కాలుష్యం తగ్గింది

2
– కోర్టుకు ఆప్‌ సర్కారు నివేదిక

న్యూఢిల్లీ,జనవరి 8(జనంసాక్షి): దేశరాజధాని ఢిల్లీలో సరి-బేసి వాహన విధానం అమలు చేయడం వల్ల నగరంలో కీలక సమయాల్లో కాలుష్యం స్థాయి తగ్గిందని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఈ విధానం ట్రయల్‌ రన్‌కు కేవలం తమకు 15 రోజులు సరిపోదని.. అవసరమైతే మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ విధానం వల్ల దిల్లీలో చాలాచోట్ల ట్రాఫిక్‌ తగ్గినట్లు అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో కాలుష్యం ఏ మేరకు తగ్గిందో 8వ తేదీ వరకు నివేదిక ఇవ్వవలసిందిగా కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. దిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం సరి-బేసి వాహన విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సరి-బేసి వాహన విధానం ప్రకారం సరి సంఖ్య తేదీల్లో సరిసంఖ్య రిజిస్ట్రేషన్‌ నెంబరు కార్లు, బేసి సంఖ్య తేదీల్లో బేసి సంఖ్య రిజిస్టేష్రన్‌ నెంబరు కార్లు తిరగడానికి అనుమతి ఇచ్చారు. ఈ విధానంపై ట్రయల్‌ రన్‌ జనవరి 15తో ముగియనుంది. దీన్ని కొనసాగించేదీ లేనిదీ ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది.