కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ గణపతుల విక్రయాలు
హైదరాబాద్,ఆగస్ట్31 ( జనంసాక్షి): వినాయక చవితి సవిూపిస్తున్న నేపథ్యంలో పర్యావరణహిత ప్రతిమల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) ఏర్పాట్లు చేస్తోంది.ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మద్దతుగా నిలవాలన్నారు. ఏటా నిమజ్జనాల కారణంగా చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తయారీదారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయించి మట్టి విగ్రహాలను రాయితీ ధరపై అందించేందుకు ఏర్పాట్లను చేపట్టింది. ఇవన్నీ కేవలం సహజ రంగులు అద్దినవే. ఈసారి 8 అంగుళాల నుంచి 5 అడుగుల వరకు ఎత్తున్న ప్రతిమలను విక్రయించనున్నారు. డిమాండ్‌ను బట్టి మరిన్ని అందుబాటులోకి తెస్తామని అధికారులు అన్నారు. పర్యావరణానికి హాని చేయని మట్టి, సహజ రంగులతో చేసిన ప్రతిమల సంఖ్యను పెంచాలని టీఎస్‌పీసీబీ నిర్ణయించింది. గతంలో సహజ రంగులతో ప్రతిమలను తయారు చేసే బాధ్యతను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయానికి అప్పగించారు. రూ.కోటి ఆర్థిక సాయాన్ని అందించారు. హయత్‌నగర్, ఎల్బీనగర్, నాగోలు, ధూల్‌పేట్‌లోని తయారీదారులకు రసాయన రంగులను వినియోగించడం వల్ల కలిగే నష్టాలు, సహజ రంగులను ఎలా ఉపయోగించాలనే విషయాలను వివరించేందుకు ప్రత్యేక కార్యశాలలు నిర్వహించారు. మట్టి విగ్రహాలను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేసారు. ప్రతిసారి కాలుష్య నియంత్రణ మండలే మట్టి ప్రతిమలను తయారు చేయించేది. గతంలో కేవలం ఇంట్లో పూజలు చేసుకునేందుకు వీలుగా చిన్న మట్టి విగ్రహాలనే ఎక్కువ సంఖ్యలో తయారు చేయించేవారు. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో ఈ పర్యాయం పెద్ద ప్రెతిమలనూ సబ్సిడీ ధరపై అందుబాటులోకి తేనున్నారు. అయిదు రకాల ఎత్తుల్లో గ్రేటర్ వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా రసాయన రంగులు అద్దినంత సులభంగా సహజ రంగులను అద్దలేరు. సమయం ఎక్కువగా పడుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో పోలిస్తే ఈసారి ధరలు కొద్దిగా పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.