కాలుష్య కోరల్లో.. ఢిల్లీ!

– రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం
– ఆందోళన చెందుతున్న ఢిల్లీ వాసులు
న్యూఢిల్లీ, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : దేశరాజధాని ఢిల్లీలో కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది.. ప్రతిఏటా శీతకాలంలో దేశ రాజధానిని కాలుష్య రక్కసి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. చలికాలం సవిూపిస్తున్న తరుణంలో నగరంలోని కొన్ని చోట్ల పవన నాణ్యతా సూచీ క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో పవన నాణ్యతా సూచీ ప్రమాదకర స్థాయిలో 407పాయింట్లు, పంజాబీ భాగ్‌ ప్రాంతంలో 307పాయింట్లు నమోదైంది. పంజాబ్‌, హరియాణా విూదుగా వీస్తున్న వాయువ్య గాలుల ప్రభావంతోనే కాలుష్యం పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ రాష్ట్రాల్లో కోతల అనంతరం వ్యర్థాలను తగలబెడుతుండడంతో ఆ పొగ ఢిల్లీకి చేరుతోందని పేర్కొంటున్నారు. నగరంలో కాలుష్య ఉద్ధృతి పెరిగిపోవడానికి ఈ రాష్ట్రాల్లో పంటలను తగలబెట్టడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. గతేడాది ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వీచే గాలుల ద్వారా ఎక్కువగా కాలుష్య కారకాలు వస్తుండడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దీనిపై సవిూక్ష నిర్వహించారు. కాలుష్యాన్ని నివారించేందుకు ఈ ఏడాది మొదట్లో ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్‌బడ్జెట్‌ పేరుతో ప్రత్యేక బడ్జెట్‌ను సైతం ప్రవేశపెట్టింది.