కాలుష్య స్థాయి పెరిగింది.. ఎవరూ బయటకు రావద్దు!

– ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పబ్లిక్‌ హెల్త్‌ హెచ్చరిక
న్యూఢిల్లీ, నవంబర్‌7(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. మంగళవారం ఉదయమే దట్టమైన పొగమంచు ఢిల్లీ వాసులకు స్వాగతం పలికింది. దీంతో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. స్కూళ్లను మూసేయాల్సిందిగా సూచించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సలహా ఇచ్చింది. కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థాయిని మించడంతో ఈ నెల 19న జరగాల్సిన మారథాన్‌ను కూడా రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ను కోరింది మెడికల్‌ అసోసియేషన్‌. సోమవారం సాయంత్రం నుంచే కాలుష్యం పెరగడం కనిపించింది. పొగమంచు తీవ్రం కావడంతో పక్కనున్న మనిషి కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఉదయం 10 గంటలకే కాలుష్య స్థాయి ప్రమాదకరంగా ఉన్నట్లు రికార్డయిందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ వెల్లడించింది. ఢిల్లీలోని దిల్షాద్‌ గార్డెన్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ గాలిలో పీపీఎం స్థాయి 420గా చూపించగా.. ఆనంద్‌ విహార్‌లో అది 319గా ఉంది. ఇక ఇది పంజాబీ బాగ్‌లో అత్యధికంగా 999గా, ఆర్కే పురంలో 852గా నమోదైంది. ఇది 50లోపు ఉంటే కాలుష్యం చాలా తక్కువగా ఉందని, 401కి పైన ఉంటే ప్రమాదకర స్థాయి అని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ తెలిపింది.