కాలేజీల్లో ర్యాగింగ్‌ నివారణకు ఏం చర్యలు : హైకోర్టు

వైద్య విద్యార్థిని ప్రీతి మృతి  ఘటనపై  వివరణ కోరిన  హైకోర్టు

హైదరాబాద్‌  (జనం సాక్షి):   వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి మృతికి కారణమైన నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ చేశామని కాకుండా ఘటనపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో ర్యాగింగ్‌ నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంది. ఎండీ అనస్థీషియా మొదటి సంవత్సరంలో చేరిన ప్రీతిని రెండో సంవత్సరం విద్యార్థి సైఫ్‌ కులం పేరుతో ర్యాగింగ్‌ చేయడంతోపాటు తన మిత్రులతో కలిసి దారుణంగా హత్య చేశారని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెలంగాణ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.మల్లయ్య రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విశ్వజాగృతి మిషన్‌ వర్సెస్‌ కేంద్రం కేసులో ర్యాగింగ్‌ నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటి అమలుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.