కాలేశ్వరం ప్రాజెక్టుతో మంథని ప్రాంతానికి తీరని నష్టం – ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వకపోగా.. వందలాది ఎకరాలు ముంపుకు గురి – సుందిళ్ల బ్యారేజ్ గేట్లు ఎత్తివేసే సమయంలో ప్రజలకు సమాచారం అందించాలి – ముంపు ప్రాంతాల్లో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలి – సుందిళ్ల బ్యారేజ్ ని సందర్శించిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు

 జనంసాక్షి, మంథని : మంథని నియోజకవర్గంలో గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుతో మంథని ప్రాంతానికి తీరని నష్టం వాటిలోతున్నదని, ఈ ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వకపోగా.. బ్యాక్ వాటర్ తో వందలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని, మా ప్రాంత రైతుల గోడును ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సుందిళ్ళ( పార్వతి) బ్యారేజ్ ను శుక్రవారం కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో మంథని ప్రాంత రైతులకు చాలా నష్టం వాటిల్లుతున్నదని, బ్యాక్ వాటర్ తో ఏలాంటి ముంపు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, బ్యారేజ్ గేట్లు ఎత్తే సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, వారికి సమాచారం అందించాలని అక్కడే సంబంధిత ఈఈ డిఈ, ఏఈ లతో పాటు సంబంధిత అధికారాలతో శ్రీధర్ బాబు మాట్లాడారు. ముంపు ప్రాంతాల వారికి సమాచారం ఇవ్వాలని, బ్యాక్ వాటర్ వల్ల వ్యవసాయ భూములు ముంపుకు గురికాకుండా, నివసించే ఇళ్లలోకి ప్రాంతాల్లో గాని నీరు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కాలేశ్వరం ప్రాజెక్టు అధికారులను శ్రీధర్ బాబు కోరారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటున్న గ్రామస్తులకు గాని, వ్యవసాయదారులకు గాని అప్రమత్తం చేయాలని, ఏలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు. కడెం ప్రాజెక్టు లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేసినందున, శ్రీ పాద ఎల్లంపల్లి, రాళ్లవాగునుండి కూడా నీరు సుందిళ్ల బ్యారేజ్ కి చేరుతున్నందున వెంటనే గేట్లు ఎత్తాలని అధికారులకు తెలపడం జరిగిందని.. ఈ గేట్లు ఎత్తేటప్పుడు ముంపుకు గురయ్యే ప్రమాదం జరగకుండా, ముందస్తుగా రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష చేసుకొని గ్రామస్తులందరిని అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని, అవసరమైతే వారిని పునరావత కేంద్రాలకు తరలించాలని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆర్ అండ్ బి, ,పంచాయతీ రాజ్ అధికారులు రోడ్ల, కుంటలు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.