కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

Kashmir1_20160712_600_855

29కి చేరిన మృతుల సంఖ్య

కాశ్మీర్లో చల్లారని అల్లర్లు
శ్రీనగర్‌,జూలై12(జనంసాక్షి):

జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్లర్ల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 29కి చేరింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కశ్మీర్‌ లోయలోని చాలా ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. అనంతనాగ్‌, షోపియాన్‌, కుల్గాం, పుల్వా మా, బారాముల్లా, సోపోర్‌, కుప్వారా, గందేర్‌బల్‌, బందిపొరా ప్రాం తాల్లో భద్రతాసిబ్బంది ఆంక్షలు విధించి పరిస్థితిని సవిూక్షిస్తున్నారు. ఈ ప్రాంతాలతో పాటు శ్రీనగర్‌, బద్గాంలో కూడా కర్ఫ్యూ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఆందోళనల కారణంగా అనంతనాగ్‌లో 14 మంది, కుల్గాంలో 8మంది, షోపియాన్‌లో నలుగురు, పుల్వామాలో ముగ్గురు, శ్రీనగర్‌లో ఒక్కరు మరణించారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ని శుక్రవారం భద్రతాదళాలు మట్టుపెట్టినప్పటి నుంచి కశ్మీర్‌ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఆందోళనకారులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణలు హింసకు దారితీశాయి. దాదాపు 800 మంది గాయాలపాలయ్యారు. వారిలో అత్యధికంగా పోలీసులే ఉన్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయోగించిన భాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్ల కారణంగా ఎంతో మంది కళ్లకు శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తోందని స్థానిక ఆస్పత్రిలోని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు సహాయపడాలని జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వేర్పాటువేద నేతలను కోరారు. రాష్ట్రలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్తూ జమ్మూలో చిక్కుకుపోయిన వారిని యాత్రకు పంపించారు. సుమారు 300 వాహనాలు యాత్రికులతో జమ్మూ నుంచి కశ్మీర్‌కు వెళ్లాయి.