కాశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం

భద్రతా బలగాలపై అల్లరి మూకల రాళ్లదాడి

శ్రీనగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా దళాలు మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఉదయం జాగూ అరిజాల్‌ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్నట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల నుంచి ఉప్పందడంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. గాలింపు జరుగుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామన్నారు. కాగా మరణించిన ఉగ్రవాదుల గుర్తింపు వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉన్నందున అటుగా ఎవరూ వెళ్లవద్దంటూ అధికారులు స్థానికులకు సూచించారు. ఈ ప్రాంతం మొత్తం గాలింపు పూర్తయ్యేదాకా ప్రజలు సహకరించాలని కోరారు. మరోవైపు బుద్గాం ఎన్‌కౌంటర్‌ తర్వాత అల్లరి మూకలు పెద్ద ఎత్తున సైనికులపై రాళ్లదాడికి దిగినట్టు సమాచారం. ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ రాళ్లదాడికి దిగారు.