కాశ్మీర్‌ గవర్నర్‌ వ్యాఖ్యలపై చిదంబరం ఫైర్‌

గవర్నర్లు కొత్త వైస్రాయిల్లా పనిచేస్తున్నారని విమర్శ

న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): భారత్‌-పాక్‌ చర్చలపై రాజకీయ పార్టీలకు మాట్లాడే హక్కు లేదంటూ ఇటీవల జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం.. ట్విటర్‌ ద్వారా గవర్నర్లపై విమర్శల వర్షం కురిపించారు. దేశంలోని గవర్నర్లు కొత్త వైస్రాయ్‌ల్లా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలకు భారత్‌-పాకిస్థాన్‌ చర్చలపై మాట్లాడే హక్కు లేదని జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ అన్నారు. ఆయన బహుశా ‘పక్షపాత ప్రజాస్వామ్యం’ లేదా ‘ఏ ప్రజాస్వామ్యం లేని’ వ్యక్తి కావొచ్చు’ అని చిదంబరం విమర్శించారు. ఇక మరో ట్వీట్‌లో.. ‘చివరి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ అని మనకు చెప్పారు. అది తప్పు. ప్రస్తుత గవర్నర్లు, లెప్టినెంట్‌ గవర్నర్లు కొత్త వైస్రాయ్‌ల్లా వ్యవహరిస్తున్నారు’ అని చిదంబరం దుయ్యబట్టారు. గత బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌.. ‘భారత్‌-పాక్‌ చర్చలపై రాజకీయ పార్టీలకు మాట్లాడే హక్కు లేదు. అది రెండు దేశాల ప్రభుత్వాలకు సంబంధించిన అంశం’ అంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ పార్టీలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది.