కాశ్మీర్ లోయల్లో ఆర్మీ భారీ కూంబింగ్

రోజురోజుకు హింస పెచ్చు మీరడంతో కాశ్మీర్ లో భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది ఆర్మీ. సుమారు నాలుగు వేల మంది సైనికులతో కాశ్మీర్ లోయలను జల్లెడ పట్టనుంది. గురవారం శోపియాన్ జిల్లాలో ఆపరేషన్ మొదలైంది. ఇవాళ కూడా ఈ కూంబింగ్ కొనసాగుతున్నది. హెలికాప్టర్లు, డ్రోన్లతో చుట్టుముట్టి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇళ్లలో దాగిన మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా భద్రతాదళాలు ఆపరేషన్ ఫ్లష్ ఔట్ చేపట్టగా సాయంత్రం మిలిటెంట్లు ఒకచోట ఆకస్మికంగా దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక పౌరుడు మరణించగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సైన్యం, పోలీసు, సీఆర్పీఎఫ్‌తో కూడిన నాలుగువేల దళాలు గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు గాలింపు నిర్వహించాయి. గత ఇరవై ఏళ్లలో అతిపెద్ద కూంబింగ్ గా దీన్ని పేర్కొంటున్నారు.

భద్రతాదళాలు ఒక్కో గ్రామంలో ప్రజలందరిని ఒకచోటకు రావాల్సిందిగా కోరి, గాలింపు జరిపాయి. భద్రతాదళాలు దౌర్జన్యపూరితంగా పౌరుల ఆస్తులను ధ్వంసం చేశాయని స్థానిక కాంగ్రెస్ నేతలు, అమాయక ప్రజలను వేధించారని వేర్పాటువాద నేతలు ఆరోపించారు. కుల్గామ్ లో క్యాష్ వ్యాన్ పై దాడి చేసి ఏడుగురు జవాన్లను హత్య చేసిన ఉమర్ మజిద్ ఉగ్రవాదిని పట్టిస్తే పది లక్షలు ఇస్తామంటూ ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు.