కిం కర్తవ్యం!?
– ఆగని ఆందోళనలు
– హెచ్‌సీయూ పాలక వర్గాల మల్లగుల్లాలు
హైదరాబాద్,జనవరి22(జనంసాక్షి): పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో అట్టుడుతున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలు ఇంకా సడలలేదు. విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా కొందరు విద్యార్థులు చేపట్టిన దీక్షలు కూడా మూడోరోజుకు చేరుకున్నాయి. ఇదిలావుంటే నలుగురు విద్యార్తులపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసిన పాలకవర్గం మరో చర్యకు ఉపక్రమించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో హెచ్ సీయూలో ఇంటర్నెట్, వైఫై నిలిపివేశారు. కంప్యూటర్, లైబ్రరీలకు తాళం వేశారు. దీని గురించి వర్సిటీ వర్గాలను విద్యార్థులు ప్రశ్నించగా ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశానుసారం ఇంటర్నెట్ తొలగించామని సమాధానం వచ్చింది. ఆడిటోరియంకు సవిూపంలో ఉన్న క్యాంపస్ నెట్ వర్క్ ఫెసిలిటీ(సీఎన్‌ఎఫ్) సెంటర్ ద్వారా విద్యార్థులు, సిబ్బందికి ఇంటర్నెట్, వై ్గ/తో పాటు ఇతర ఐటీ సేవలు అందిస్తున్నారు. విద్యార్థుల హాస్టళ్లు, కామన్ ఏరియాలో ఇంటర్నెట్, వైఫై నిలిపివేయాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని సీఎన్‌ఎఫ్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. దీంతో క్యాంపస్ లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. తమ ఆందోళన ఉధృతం కాకుండా అడ్డుకునేందుకే ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా విద్యార్థులు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారని గ్రహించిన ఉన్నతాధికారులు క్యాంపస్ లో అంతర్జాలం అందుబాటులో లేకుండా చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు సమావేశమయ్యారు. యూనివర్సిటీలోని డీఎస్ టీ ఆడిటోరియంలో దాదాపు 200 మంది అధ్యాపకులు భేటీ అయ్యారు. ఆందోళనలు కొనసాగితే.. విద్యార్థుల కెరీర్ కు నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్లను పరిశీలించి.. వర్సిటీ లో ప్రశాంత వాతావరణం నెల కొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆందోళనలు, ఉద్రిక్తతలు యూనివర్సిటీకి మాయని మచ్చగా మారనున్నాయని అభిప్రాయం వెలిబుచ్చారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలు తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఎనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరింది. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేశారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, ఎన్‌ఎస్‌యూఐ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాలకు చెందిన విద్యార్థులు గుమ్మడి ప్రభాకర్, ఉమామహేశ్వర్, వైఖరి, జయారావు, మనోజన్, కృష్ణయ్య, జైలావ్, రమేశ్ ఈ దీక్షకు దిగారు.
దీక్ష చేస్తున్న విద్యార్థుల బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు.