కిరణ్‌ బేడీ వర్సెస్‌ చీఫ్‌ సెక్రటరీ

  • ఎల్‌జీ వద్దన్నా మున్సిపల్‌ కమిషనర్‌పై సీఎస్‌ వేటు..
  • మండిపడిన బేడీ.. ఆయన బదిలీకి కేంద్రానికి సిఫారసు
  • పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శిని నివేదిక కోరిన కేంద్రం
పుదుచ్చేరి, ఏప్రిల్‌ 7: కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ తరహా రగడే మరో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ మొదలైంది. ఇక్కడ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీకి ఇప్పటికే పొసగడం లేదు. తాజాగా రాజకీయ నాయకత్వం ఒత్తిళ్లకు తలొగ్గి.. బేడీ ఆదేశాలు ఖాతరు చేయకుండా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పరీడా.. పుదుచ్చేరి మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌.చంద్రశేఖరన్‌ను బదిలీ చేశారు. దీనిపై బేడీ మండిపడ్డారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏ అధికారిని బదిలీ చేయాలన్నా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి అవసరమని తేల్చిచెప్పారు. సీఎస్‌ ఆదేశాలను తోసిపుచ్చి.. చంద్రశేఖరన్‌ను తిరిగి కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. పరిపాలన స్తంభించిపోవడానికి కారణమైన సీఎస్‌ పరీడాను తక్షణం బదిలీ చేయాలని కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేశారు. కేంద్రం కూడా ఈ వివాదంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించింది.