కిషన్‌రెడ్డి పాదయాత్ర భగ్నం

3

అరెస్టు చేసిన పోలీసులు

వరంగల్‌,సెప్టెంబర్‌3(జనంసాక్షి):

తెలంగాణ బిజెపి అద్యక్షుడు కిషన్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ జిల్లా కంతనపల్లి నుంచి దేవాదుల వరకు పాదయాత్ర చేపట్టిన కిషన్‌ రెడ్డిని పోలీసులు భగ్నం చేశారు.ఆయనకు పాదయాత్ర చేయడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ప్రాజెక్టుల బాట లో భాగంగా కిషన్‌ రెడ్డి ఈ పాదయాత్ర నిర్వహించతలపెట్టారు. పోలీసులు చుట్టుముట్టినప్పుడు కార్యకర్తలకు ,పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసుల కిషన్‌ రెడ్డిని అరెస్టు చేసి అక్కడ నుంచి తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తూ పాదయాత్ర చేపట్టిన తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఏటూరునాగారం పోలీసులు అరెస్టు చేశారు. పాదయాత్రలో భాగంగా ఆయన వరంగల్‌ జిల్లా కంతనపల్లి గ్రామానికి గురువారం ఉదయం 10 గంటలకు చేరుకుని అక్కడి సమావేశంలో మాట్లాడారు. అనంతరం కంతనపల్లి నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకం వరకు పాదయాత్రను ప్రారంభించారు. దేవాదుల వైపుగల రహదారిపై 7 కిలోవిూటర్లు నడిచిన అనంతరం ములుగు డీఎస్పీ రాజామహేంద్రనాయక్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆయనను అరెస్టుచేశారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన ఏటూరునాగారం ఏజెన్సీలో పాదయాత్ర చేపట్టడం ఇబ్బందికరమని.. భద్రత కారణాల దృష్ట్యా అరెస్టు చేస్తున్నామంటూ పేర్కొని కిషన్‌రెడ్డిని ఏటూరునాగారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్రనాయకులు గుజ్జుల దేవేందర్‌రెడ్డి, మార్తినేని ధర్మారావు, చంద్రశేఖర్‌రావు, రాంచంద్రారెడ్డి, యండెల లక్ష్మీనారాయణ, పాసం వెంకటేశ్వర్లు, రావుపద్మ,ఉషాకిరణ్‌ తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు ఉన్నారు. అయితే  తన అరెస్ట్‌ వెనక రాజకీయకోణం ఉందని బీజేపీ నేత కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ ఎన్నడూ అరెస్ట్‌ కాలేదని ఆయన విమర్శించారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై కేంద్రానికి..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఆంధ్రా ఏజెంట్లో ప్రజలే తేలుస్తారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హరీష్‌రావు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. కొత్త ప్రాజెక్టులను ఆహ్వానిస్తామనీ కానీ పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు ఉద్యమిస్తామని కిషన్‌ తెలిపారు.