కిషన్‌రెడ్డి 11మందిని చంపించారు

– తాను తప్పించుకొని అమెరికా పారిపోయా
– ఆ హత్యలను మతకలహాలుగా మార్చారు
– ఈవీఎం హ్యాకింగ్‌పై సయ్యద్‌ సుజా సంచలన ఆరోపణలు
– కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలు చేస్తోంది – కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌, జనవరి23(జ‌నంసాక్షి) : కిషన్‌రెడ్డి తమను హతమార్చేందుకు ప్రయత్నించాడని ఈవీఎం హ్యాకింగ్‌పై సయ్యద్‌ సుజా బుధవారం మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా సుజా మాట్లాడుతూ.. బీజేపీ నేత కిషన్‌రెడ్డి బావమరిది కాకిరెడ్డి గెస్ట్‌హౌస్‌లో తమపై కాల్పులు జరిపారని ఆరోపించారు. 2014 మే13 తెల్లవారుజామున 13 మందితో గెస్ట్‌హౌస్‌కు వెళ్లామని సుజా తెలిపారు. అక్కడే ఉన్న కిషన్‌ రెడ్డి.. మమ్మల్ని చంపేయమంటూ గన్‌మెన్లకు ఆదేశించారని చెప్పారు. వాళ్లు జరిపిన కాల్పుల్లో తమ వాళ్లు 11 మంది చనిపోయారని సయ్యద్‌ సుజా వెల్లడించారు. మృతుల్లో సమావేశం నిర్వహించిన కమల్‌రావు కూడా ఉన్నారని, తాను తప్పించుకుని అమెరికా వెళ్లిపోయానని సుజా తెలిపారు. ఆ తర్వాత వాటిని మతకలహాల మరణాలుగా మార్చారని, ఉప్పల్‌ లిటిల్‌ ఫ్లవర్‌ కాలేజి దగ్గర కాకిరెడ్డి గెస్ట్‌హౌస్‌ ఉందని సయ్యద్‌ సుజా తెలిపారు. విన్‌ సొల్యూషన్స్‌ ద్వారా ఈసీఐఎల్‌కు టెక్నికల్‌ సహకారం అందించామని సయ్యద్‌ సుజా చెప్పారు. విన్‌ సొల్యూషన్స్‌లో దర్యాప్తు చేస్తే అంతా తెలుస్తుందని ఆయన అన్నారు. అమెరికాలో తనను మనీష్‌ సిసోడియా, అర్ణబ్‌ గోస్వామి, వంశీరెడ్డి కలిశారని, ఈసీఐఎల్‌లో పనిచేస్తున్న సమయంలో కూడా వంశీరెడ్డి కలిశారని సుజా చెప్పారు. వీవీప్యాట్‌లో బగ్‌ ఫిట్‌ చేయమని తనను వంశీరెడ్డి అడిగారని తెలిపారు. తర్వాత వంశీరెడ్డిని బస్సు ప్రమాదం పేరుతో చంపేశారని, ఈ నిజాలు వెలికితీస్తారా అంటూ కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. జేఎన్‌టీయూలో తాను ఆర్‌ఎఫ్‌ ఇంజినీరింగ్‌ చేశానని, షాదాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజిలో బీటెక్‌ చేశానని సయ్యద్‌ సుజా పేర్కొన్నారు. అయితే ఆయన తన కుటుంబ నేపథ్యం గురించి వివరాలు వెల్లడించలేదు.
కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలు చేస్తోంది – బీజేపీ నేత కిషన్‌రెడ్డి
2014, మే 13న తాను 11మందిని హతమార్చేందుకు గన్‌మెన్‌లను ఆదేశించినట్లు వస్తున్న ఆరోపణలపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి స్పందించారు. సయ్యద్‌ షుజా అనే హ్యాకర్‌ చెప్పిన దానిలో ఎలాంటి నిజాలు లేవన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలోకి ఉంది కదా కిషన్‌రెడ్డి  ప్రశ్నించారు. అలాంటి పరిస్థితుల్లో తాను ఈవీఎంల హ్యాకింగ్‌ వ్యవహారంలో 11మందిని ఎలా చంపగలనని నిలదీశారు. ఈ వ్యవహారంలో అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లండన్‌ లో జరిగిన హ్యాకర్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ హాజరైన విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదనీ,  ఏపీ, తెలంగాణలో హత్యలకు పాల్పడింది కాంగ్రెస్‌ నేతలేనని దుయ్యబట్టారు.