కిసరలో కూలిన యుద్ధవిమానం

– సురక్షితంగా బయటపడ్డ పైలట్‌

మేడ్చల్‌,సెప్టెంబర్‌ 28,(జనంసాక్షి): మేడ్చల్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఫోర్స్‌ శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన జిల్లాలోని కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. విమానం శకలాలు కిందపడ్డ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో స్థానికులు ఏం జరగుతుందో అర్థంకాక కాసేపు భయాందోళనలకు గురయ్యారు. హకీంపేట విమాన శిక్షణ కేంద్రం నుంచి విమానం బయలుదేరింది. ఈ విమానంలో ట్రైనీ పైలెట్‌ అమిన్‌పాండే మిమానం నుంచి దూకి ప్రమాదం నుండి బయటపడ్డాడు. బయలు దేరిన కొద్దిసేపటికే కీసర సవిూపంలో అంకిరెడ్డిపల్లి శివారులో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. వెంటనే విమాన శంకలాలు చల్లాచెదరుగా పడటంతో ఆ శకలాల కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించటంతో స్థానికులు బయాందోళనకు గురయ్యారు. ఈ లోపు సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదంపై వైమానిక దళం దర్యాప్తు చేపట్టింది.