కిసాన్‌ సమ్మాన్‌ పథకం అమలుకు తప్పని రైతుసర్వే

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకం అమలుతో అసలుసిసలు రైతుల సంఖ్య తేలనుంది. ఈ పథకం కింద రతులను గుర్తించేందుకు సవాలక్ష నిబంధనలు జోడించారు. తెలంగాణలో సిఎం కెసిఆర్‌ రైతుబంధు పథకం ప్రవేశ పెట్టినప్పుడు విశాల హృదయంతో పథక రచన చేశారు. భూమివుంటే రైతు అన్న భావనలో పెట్టుబడి అందించారు. దీంతో అనేకులు లబ్దిపొందారు. అనర్హులు కూడా డబ్బులు అందుకున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర పథకం వచ్చే సరికి 25 శాతం మందికి కూడా లబ్ది చేకూరకపోచ్చు. ఈ పథకం అమలుకు కేంద్ర వ్యవసాయశాఖలో ముఖ్య కార్య నిర్వహణాధికారి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇలాగే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి. పథకం అమలుపై పెద్దయెత్తున ప్రచారం చేయనున్నారు. అయితే కేంద్ర పథకంపై రైతుల్లో పెద్దగా ఆశలు కనిపించడం లేదు. ఇందులో భాగంగా భూముల యజమానుల్లో అనర్హులను గుర్తించి, ప్రతి రైతు నుంచి ధ్రువపత్రం తీసుకోవడానికి ఇంటింటి సర్వే చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ నిర్ణయించింది. మూడు వారాల్లోగా సర్వే పూర్తిచేసి అర్హుల జాబితాను గ్రామాల వారీగా ప్రకటిస్తారు. తొలుత రేషన్‌ కార్డు ఆధారంగా రైతు కుటుంబాలను తీసుకుని వారి ఆధార్‌ సంఖ్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దీనివల్ల సదరు కుటుంబానికి ఎంత భూమి ఉందనే లెక్క కంప్యూటర్‌ గుర్తిస్తుంది. ఇందులో ఐదెకరాలలోపు ఉన్నవారిని విడదీస్తారు. వారిలో మళ్లీ నిబంధనల ప్రకారం అనర్హులను తొలగిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో 5 ఎకరాల్లోపున్న వారు 47 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ రూ.6 వేల చొప్పున ఇస్తే దాదాపు రూ.2825 కోట్ల వరకూ వస్తాయని బడ్జెట్‌ ప్రకటించిన రోజున వ్యవసాయశాఖ లెక్కగట్టింది. కానీ ఇప్పుడు అనర్హులను తొలగిస్తే చివరికి రూ.700 కోట్ల వరకు మాత్రమే వస్తాయని అంచనా వేస్తున్నారు. సర్వే అనంతరమే అసలు విషయం తేలుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా రైతుబంధు తరహాలో కిసాన్‌ సమ్మాన్‌ ప్రవేశపెట్టింది. తెలంగాణ రైతుబంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఈపథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని పథకాలను అమలు చేసే పనిలో పడ్డాయి. అదే దిశలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు పంట పెట్టుబడి సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.అయితే తెలంగాణలో అమలవుతున్నంత విశాలంగా ఎక్కడా అమలు అయ్యే అవకాశాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు పేద రైతుల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయి. పంటలు వేసే సమయానికి చేతిలో చిల్లిగవ్వలేక రైతన్నలు షావుకారులను ఆశ్రయించే పద్ధతులకు స్వస్తి పలకాలని తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయడంతో రైతన్నలకు భరోసా దక్కింది. రైతు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించి కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. అకాల మరణం చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రీమియం సొమ్మును కూడా ప్రభుత్వమే చెల్లించింది. వీరందరికీ ప్రభుత్వం ప్రీమియం చెల్లించి బీమా బాండ్‌ రైతులకు అందజేశారు. ఇప్పటికే వివిధ కారణాలతో అనారోగ్యంతో మృతి చెందిన రైతులకు వారి ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. ఒక్కో రైతుకుటుంబానికి రూ.5లక్షల చొప్పున ఈ సాయాన్ని అందజేశారు.రైతుబంధు పథకాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఎకరానికి రూ.5 వేల చొప్పున వచ్చే వ్యవసాయ సీజన్‌ రైతులకు అందించనుంది. రెండు పంటలకు గాను ఎకరానికి రూ.పది వేల చొప్పున రైతులకు సాయం అందించనున్నారు. చరిత్రలో నిలిచిపోయిన రైతుబంధు పథకంతో రైతులకు పంట పెట్టుబడి సాయం ఒక

వరంలా మారింది. ప్రతీ ఏడాది వ్యవసాయం చేసే రైతన్నలకు ఆదిలోనే అప్పులు తెచ్చుకొని ఇబ్బందుల పాలయ్యేవారు. ఇలాంటి సమస్యను అధిగమించేందుకే తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడంతో గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ రైతులు పంట పెట్టుబడి సాయం చేతికి అందే సరికి ఆనందంతో సాగుకు సమాయత్తం అయ్యారు. ఇదే కాక రబీ పంటకు కూడా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కావడంతో యాసంగి పంటలు కూడా సాగు చేసుకున్నారు. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా పెరిగిందని అధికారలు చెప్తున్నారు. దానికి తోడు ధాన్యం మద్దతు ధర కూడా పెరిగినందున రైతులు ఎక్కువశాతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే విక్రయాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకం రైతులకు ఉపయోగకరంగా ఉంది.రైతుబంధు పథకం మంచి ఫలితాలను ఇచ్చింది. ఎవరి దగ్గరకు పెట్టుబడికి వెళ్లకుండా రైతులకు సాయం ఉపయోగపడింది. అయితే కేంద్రం విధించిన నిబంధనల కారణంగా తక్కువ మందికి మాత్రమే సాయం అందనుంది. అదికూడా అరకొర సాయం కారణంగా పెద్దగా ఎవరు కూడా ఆసక్తి చూపడం లేదు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద అర్హులైన రైతులను గుర్తించేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఐదెకరాల లోపు భూమి ఉన్నవారందరినీ కాకుండా నిజమైన రైతులనే గుర్తించాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ జాబితాలో ఎవరెవరిని తొలగించాలనే అంశాలను స్పష్టం చేసింది. ఈ నెల 25కల్లా అర్హుల వివరాలను పీఎం కిసాన్‌ పోర్టల్‌లో నమోదు చేస్తే ఆ మరుసటి రోజు నుంచే రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతాయని రాష్ట్ర వ్యవసాయశాఖకు తెలిపింది. అర్హులందరినీ గుర్తించే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు సేకరించిన వారి వివరాలు నమోదు చేయాలని సూచించింది. మార్చి నెలాఖరులోగా అర్హులైన ప్రతీ రైతు ఖాతాలో తొలి విడత రూ.2 వేలు జమ చేయనున్నారు.