కీసర అడవిని.. దత్తత తీసుకున్న టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్
– కేటీఆర్ బర్త్ డే సందర్భంగా వినూత్న నిర్ణయం
హైదరాబాద్, జులై23(జనంసాక్షి) : టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బుధవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా హంగు, ఆర్భాటాలు లేకుండా సమాజహితం కోసం పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేటీఆర్ ఇచ్చిన గిప్ట్ ఏ స్మైల్ నినాదాన్ని ఎంపీ సంతోష్ స్ఫూర్తిగా తీసుకున్నారు.
కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా.. ప్రభుత్వం అటవీశాఖ ద్వారా అమలు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిలో భాగంగా కీసరగుట్ట అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం పార్కును సొంత నిధులతో తీర్చిదిద్దుతాం అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే కీసరగుట్ట అటవీ ప్రాంతంలో పర్యటించి.. అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతంగా ఉన్నాయని, పట్టణ ప్రాంత వాసులు సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకునేందుకు ఈ పార్కులు తోడ్పడుతాయని అన్నారు. వారాంతాల్లో కుటుంబంతో సహా సేదతీరే చక్కని ప్రాంతాలుగా పిల్లల్లో పర్యావరణం, అటవీ, జీవవైవిధ్యం ప్రాధాన్యతలు తెలుసుకునే ప్రాంతాలుగా అర్బన్ ప్రాంతాల అభివృద్ధి జరుగుతోందన్నారు. కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని మంచి ఎకో టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్ది హైదరాబాద్ వాసులకు బహుమతిగా ఇస్తామన్నారు. యాదాద్రి, కీసరగుట్టలకు వచ్చే భక్తులు, పర్యాటకులకు కూడా ఈ ఎకో టూరిజం పార్కు అందుబాటులో ఉంటుందని తెలిపారు. తన ట్విట్టర్ ద్వారా మరికొందరు ప్రముఖులను కూడా ట్యాగ్ చేశారని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. అటవీ ప్రాంతాల అభివృద్ధి, అర్బన్ లంగ్ స్పేస్‌ల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆహ్వానించారు. ఎంపీ సంతోష్ తీసుకున్నది మంచి నిర్ణయం అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఆహ్వానం పలికారు. ఎంపీ సంతోష్ కుమార్‌ను ప్రశంసిస్తూ నేటిజర్లు మేసేజ్‌లు పోస్టు చేస్తున్నారు.