కుక్కలు, పందుల ఆవాసంగా ఆర్టీసీ కాలనీ
బోడుప్పల్ కార్పోరేషన్ లో తీరని కుక్కల బెడద
మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు
స్థానికులపై తరచూ దాడులు.. ప్రమాదకర పరిస్థితులు
మేడిపల్లి – జనంసాక్షి
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కు “బౌ భౌ” బెడద నేటికీ వేధిస్తోంది. ఎండ్ల తరబడి వీధి కుక్కల గోల స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. తరచూ దాడులు జరుగుతున్న.. వాహన ప్రమాదాలు సంభవిస్తున్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బయటకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది.
చెంగిచెర్ల పరిధిలోని ఆర్టీసీ కాలనీ, ప్రశాంత్ నగర్ కాలనీ లలో గత కొన్ని రోజులుగా స్థానికులు జంకుతున్నారు. నేరుగా ఇళ్లలోకి అపార్ట్మెంట్లలోకి పందులు, కుక్కలు వచ్చి భయాందోళనకు గురిచేస్తున్నాయి. గోడలు గేట్ల తక్కువ ఎత్తులో ఉండడంతో వీధి కుక్కలు అందులోకి వెళ్లి నివాసయోగ్యంగా మార్చుకుంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా గార్బేజి ల వద్ద చెత్త పేరుకుపోవడంతో పందులు కుక్కలు వాటిని పీక్కుతింటూ చెత్తాచెదారాన్ని రోడ్లపైకి నివాస ప్రాంతాల్లోకి తీసుకువస్తున్నాయని చెబుతున్నారు. దీంతోపాటు వాహనాలపై వెళ్తుండగా వెంబడిస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో దాడులకు తెగబడుతున్నాయని చెప్పారు. మరోవైపు దోమలు ఎక్కువై మలేరియా డెంగ్యూ వ్యాధులు రాబలే అవకాశం ఉందని ఆర్టీసీ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికీ అదే సమస్య..
కార్పొరేషన్ లో కుక్కల కుటుంబ నియంత్రణకు పెట్టిన బడ్జెట్ అయిపోయిందని తెలుస్తోంది. కానీ బయట చూస్తే మాత్రం వీధి కుక్కలు గల్లి గల్లిలో స్వైర విహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు, ఆర్టీసీ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మున్సిపల్ అధికారులకు వినతులు అందజేసిన ఫలితం లేకుండా పోతుంది. కుక్కలు పందులను అరికట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వాటిని నియంత్రించాలంటే మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందేనని ఓ అధికారి “జనంసాక్షి”తో చెప్పారు. అందువల్ల ఉన్నతాధికారులు, పాలకవర్గం పట్టించుకుని గ్రామ సింహాల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Attachments area