కుట్రలు వీడని పాక్‌ సైన్యం

ఉగ్రవాదులతో అలజడి సృష్టించేందుకు కుట్రలు

పసిగట్టిన భారత్‌ నిఘావర్గాలు

ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): పాకిస్థాన్‌ నూతన ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న దశలో భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాక్‌ ఆర్మీ కుట్రలు చేస్తోంది. సరిహద్దుల్లో ఉగ్రవాదులను సరిహద్దులను దిటించే పనిలో ఉన్నట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. ఇటీవల జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన ఇమ్రాన్‌ మిత్రపక్షాల మద్దతుతో ప్రధాని పీఠంపై కూర్చునేందుకు సన్నద్ధమవుతున్నారు. పొరుగు దేశం భారత్‌తో సత్సంబంధాలు పెంపొందించుకునేందుకు, శాంతిచర్చలకు తాను సిద్ధమేనని ఎన్నికల ఫలితాల అనంతరం వెల్లడించారు. ఐతే ఆదేశ సైన్యం మాత్రం భారత్‌లో అలజడి సృష్టించేందుకు ప్రణాళికలు వేస్తోంది. భారత నిఘా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌వోసీ), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సుమారు 600 మందికి పైగా టెర్రరిస్టులను పాక్‌ నుంచి భారత భూభాగంలోకి పంపి విధ్వంసం సృష్టించాలని నిర్ణయించుకుంది. సరిహద్దులో చొరబాట్లకు ఆ దేశ సైన్యం సంపూర్ణ సహకారం అందిస్తోందని భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్రానికి ఒక నివేదిక అందించాయి.

భారత బలగాలపై దాడులు చేసి భారీగా ప్రాణనష్టం కలిగించేలా వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. దీని కోసం వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని నిఘా వర్గాలు నివేదికలో పేర్కొన్నాయి. ఈ ఏడాది జులై 22 వరకు జమ్మూ కశ్మీర్‌లో 110 మంది ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయని మంగళవారం పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్‌తో సరిహద్దులో భారత్‌లో ఒక్కో సెక్టార్‌ నుంచి ఎంతమంది చొరబాటుకు ప్రయత్నిస్తున్నారనే వివరాలను కూడా వెల్లడించింది. మొత్తం 11 సెక్టార్లలో ఉగ్రవాదులు రెడీగా ఉన్నారని.. అత్యధికంగా కెరన్‌ సెక్టార్‌లో 117 మంది టెర్రరిస్టుల కదలికలను గుర్తించినట్లు తెలిపింది.