కుదిరితే ఒకేరోజు.. కేసులన్నీ పరిశీలిద్దాం


– సీజేఐ రంజన్‌ గొగొయ్‌
– న్యాయవాదులతో సమావేశమైన సీజేఐ
న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : వీలైతే మనం ఒకేరోజు కేసులన్నీ విచారణ చేపడదామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ వ్యాఖ్యానించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి బుధవారం లాయర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టులోని పరిపాలన విభాగంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి ఆయన మనసులో ఉన్న ఆలోచనలను ఈ సమావేశంలో పంచుకున్నారు. ‘మన విధానాలు మార్చుతున్నామని నేను కచ్చితంగా హావిూ ఇవ్వగలనని అన్నారు. కానీ ప్రతి మార్పునకు కొంత  సమయం పడుతుందని, మనకు సహనం ఉండడంతోపాటు మన రిజిస్ట్రార్లకు కొంత సమయం ఇవ్వాలన్నారు. కేసుల విచారణలో ఆలస్యంపై లాయర్లతోపాటు పిటిషన్‌ దారుల ఆవేదనను మేం అర్థం చేసుకుంటామని, కానీ అందరినీ సంతృప్తిపర్చేలా మా వంతు కృషి చేస్తామని అన్నారు. కేసుల విచారణ ప్రాధాన్యక్రమంలో తమకు ఎదురవుతున్న సమస్యలను అంతకుముందు లాయర్లు సీజేఐ ముందుంచారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాల సమయాన్ని బట్టి అవి విచారణకు రావడం లేదని.. కేవలం శిక్షలు పడే కేసులు మాత్రమే ముందుగా విచారణకు వస్తున్నాయని వారు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌.. సమయం కొరత వల్ల అన్ని కేసులను ఒకే రోజు విచారణ జరపడం కుదరదని, ఇకపై వ్యాజ్యాలు దాఖలైన సమయం ప్రాతిపదికగా కేసుల విచారణ ప్రాధాన్యం ఉండేలా చూస్తామని హావిూ ఇచ్చారు. ఒకసారి ఏదైనా కేసు విచారణను ధర్మాసనానికి కేటాయించాక దాన్ని తప్పించి మరో కేసును విచారణ చేయించే పద్ధతి ఇకపై ఉండదని సీజేఐ స్పష్టం చేశారు.