కుదిరిన మహా ఒప్పందం
– గోదావరి బ్యారేజీల నిర్మాణానికి కీలక మలుపు
– దేవేంద్ర ఫడ్నవీస్, కేసీఆర్ సమక్షంలో సంతకాలు
ముంబయి,ఆగస్టు 23(జనంసాక్షి): గోదావరి నదిపై నిర్మించే బ్యారేజీలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంగళవారం కీలక ఒప్పందం కుదిరింది. తెలంగాణ నిర్మించబోయే ప్రాజెక్టులకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో ఎలాంటి పేచీలు లేకుండా తెలంగాణ ముందడుగు వేసింది. ఈ ఏడాది మార్చి 26న జరిగిన ఒప్పందానికి కొనసాగింపుగా ప్రాజెక్టుల నిర్మాణంపై ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో తుది ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముంబయిలోని సహ్యాద్రి అతిథిగృహంలో తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడణవీస్‌ల సమక్షంలో ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పంద మేరకు గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి అనుమతి ఉంటుంది. గోదావరి నదిపై 100 విూటర్ల ఎత్తులో 16 టిఎంసిల నీటి నిలువ సామర్థ్యంతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, ప్రాణహితపై తుమ్మిడిహట్టి వద్ద 1.8 టిఎంసిల నీటి నిలువ సామర్థ్యంతో బ్యారేజీ, పెనుగంగాపై 213 విూటర్ల ఎత్తులో 0.85 నీటి నిలువ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం చేపట్టేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో ఈ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నీటి పారుదల రంగంలో ఇరు రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం జరిగిందన్నారు. ఈ ఒప్పందంపై సంతకాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవి అని పేర్కొన్నారు. మహారాష్ట్రతో తామేప్పుడూ సఖ్యతగానే ఉంటామని స్పష్టం చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో ఇరు రాష్ట్రాల నడుమ సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు. ఈ ఒప్పందానికి ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు విశేష కృషి చేశారని తెలిపారు. కేంద్రం జోక్యం లేకుండానే ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరగడం శుభపరిణామం అని చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టే 60 ఏళ్లుగా పోరాటం చేశామన్నారు. మహారాష్ట్రతో భవిష్యత్ లోనూ స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను తెలంగాణ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. అంతరాష్ట్ర ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో సార్లు చర్చలు జరిగాయని తెలిపారు. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను పట్టించుకోలేదని గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కాలేదని తెలిపారు. ఇరు రాష్ట్రాల నడుమ ఒప్పందం దేశానికే ఆదర్శమని చెప్పారు. తుమ్మిడిహట్టితో మహారాష్ట్రకు జరిగే నష్టాన్ని నివారించేందుకు మేడిగడ్డ వద్ద బ్యారేజీ ప్రతిపాదించామని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నీటిని ఆదిలాబాద్ జిల్లాకు మాత్రమే ఉపయోగిస్తామన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయమేంటో దేశమంతా తెలుసన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే నినాదాలుగా తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. చారిత్రక ఒప్పందం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా అభివర్ణించారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, సీఎస్‌లు, ఇంజినీర్లను అభినందించారు. దేశానికి తెలంగాణ, మహారాష్ట్ర సరికొత్త నిర్దేశాన్ని చూపించాయన్నారు. గోదావరి ప్రాజెక్టుపై ఒప్పందంతో దేశంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. అనంతరం మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఈ ఒప్పందంతో మహారాష్ట్రకు ఎలాంటి అన్యాయం జరగదని కూడా స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఒప్పందంతో ఇరు రాష్ట్రాల సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆచరణాత్మకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో తెలంగాణ మంత్రి హరీష్‌రావు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. ఒప్పందం తర్వాత తెలంగాణ ప్రభుత్వం మూడు బ్యారేజీలు, మహారాష్ట్ర రెండు బ్యారేజీల నిర్మాణం చేపట్టనున్నాయి. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద, ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజీలు పూర్తిగా తెలంగాణకు సంబంధించినవి కాగా.. మిగిలిన మూడు సంయుక్త ప్రాజెక్టులు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు హరీష్ రావు,ఆటెల రాజేందర్, మహ్మూద్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, సిఎస్ రాజీవ్ శర్మ, స్మితా సబర్వాల్,నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్ వద్ద సంబరాలు
మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరిన సందర్భంగా తెలంగాణభవన్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. భవన్ ఆవరణలో టీఆర్‌ఎస్ శ్రేణులు టాపసులు పేల్చుతూ సంబురాలు జరుపుకున్నారు. జైతెలంగాణ నినాదాలతో ¬రెత్తిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రాజెక్టుల విసయంలో మనం ముందుకు పోవడం గర్వ కారణమన్నారు.




