కుప్పకూలిన హెలికాప్టర్.. జాడలేని ప్రయాణికులు

మాస్కో: రష్యాలోని అల్టాయ్ రిపబ్లిక్ ప్రాంతంలో ఓ సివిల్ హెలికాప్టర్ కుప్పకూలడంతో ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి జాడ తెలియరాలేదని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వశాఖ వెల్లడించింది. రాబిన్‌సన్ 366 రకానికి చెందిన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్.. ఆదివారం రాత్రి టెలెట్ స్కోయ్ సరసు వద్ద కుప్పకూలింది. ‘‘160 మందికి పైగా సిబ్బంది సోమవారం తెల్లవారు జాము నుంచి గాలింపు చేపట్టారు’’ అని ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. మరో 68 మంది సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా గాలింపు చేపడుతున్నట్టు వెల్లడించారు. హెలికాప్టర్ కూలినప్పుడు అందులో మాజీ డిప్యూటీ చీఫ్ అనాటోలీ బన్యా సహా మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే మాజీ డిప్యూటీ చీఫ్ గత ఎనిమిదేళ్ల క్రితం ఎమ్ఐ-8 విమాన ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం విశేషం.