కుమార్తెలపై అత్యాచారం.. పదేళ్ళుగా ఇదే తంతు…

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే తన కుమార్తెల పాలిట కాలయముడయ్యాడు. తనకు ఎయిడ్స్‌ ఉందని తెలిసీ ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగు చూసిన ఈ అత్యాచార కేసు వివరాలను పరిశీలిస్తే… ముంబైలోని కండివ్లీకి చెందిన 40 యేళ్ళ వ్యక్తి.. కార్పెంటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే, పెద్ద కుమార్తె వయస్సుకు వచ్చిన తర్వాత ఆమెపై కన్నుపడింది. అంతే ఈ బాలిక యవస్సు 12గా ఉన్నప్పుడు అత్యాచారం చేశాడు. ప్రస్తుతం ఈమె వయస్సు 21 యేళ్లు. గత పదేళ్ళగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం భార్యకు తెలిసినా… కుటుంబం పరువు పోతుందని, కుటుంబ పోషణ భారమవుతుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

 

ఈ నేపథ్యంలో ఆ కామాంధుడి కన్ను చిన్న కుమార్తెపై పడింది. అంతే.. మరో క్షణం ఆలస్యం చేయకుండా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆ చిన్నారి తన అక్కకు చెప్పింది. గత పదేళ్ళుగా తాను అనుభవిస్తున్న నరకాన్ని తన చెల్లెలికి రాకూడదని ధైర్యం చేసి.. స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కామాంధుడికి వైద్య పరీక్షలు చేయగా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడని తేల్చారు. ఈ విషయం ఆ కామాంధుడుకి ముందే తెలుసని చెప్పడంతో పోలీసులు, వైద్యులు నిర్ఘాంతపోయారు. 
దీనిపై చర్కోప్ పోలీసులు స్పందిస్తూ యేడాది క్రితమే హెచ్ఐవీ సోకినట్టు నిందితుడికి తెలుసని, అప్పటి మందులు తీసుకుంటున్నాడని చెప్పాడు. ఈ వ్యాధి భార్యకు సోకిందా అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని చెప్పాడని పోలీసులు చెప్పారు. కాగా, పెద్ద కుమార్తెపై అత్యాచారం గత 2005 నుంచి చేస్తున్నట్టు అతని భార్య పోలీసులకు చెప్పింది. ఈ విషయం బయటకు పొక్కితే సమాజం తమను వెలివేస్తుందని, కట్టుకున్న భర్తను పోలీసులు అరెస్టు చేస్తే తాము దిక్కులేనివారమవుతామని భయపడి ఈ విషయం బయటకు చెప్పలేదని చెపుతోంది. 

రెండో కుమార్తెపై కూడా అత్యాచారం జరిగిన సమయంలో భార్య కూడా ఇంట్లోనే ఉంది. ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ కామాంధుడిపై ఐపీసీ 376 (రేప్)తో పాటు పొస్కో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి సెప్టెంబర్ 2వ తేదీన కోర్టులో హాజరుపరిచి, విచారణ నిమిత్తం సెప్టెంబర్ 8 వరకు కస్టడీకి తీసుకున్నారు.