కులవివక్ష నిరోధక చట్టం తేవాలి
– ఆరెస్సెస్ భావజాలం విద్యార్థులపై రుద్దుతున్నారు
– హెచ్‌సీయూలో విద్యార్థులకు సంఘీభావంగా రాహుల్ ఒకరోజు దీక్ష
హైదరాబాద్,జనవరి30(జనంసాక్షి): కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ‘మహాదీక్ష’ చేపట్టారు. విద్యార్థుల దీక్షకు సంఘీభావంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం అర్థరాత్రి నుంచి దీక్షలో పాల్గొన్నారు. సుమారు 8గంటల పాటు దీక్షలో పాల్గొన్న రాహుల్‌కు అధ్యాపకులు, విద్యార్థులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మృతికి కారుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. రోహిత్ జయంతి సందర్భంగా హెచ్‌సీయూ క్యాంపస్‌లో విద్యార్థులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో పాల్గొనేందుకు రాహుల్ రెండోసారి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోహిత్ తరపున న్యాయం కోసం పోరాడేందుకే హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసిందన్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా, రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజు, విద్యార్థులు దీక్షలో పాల్గొన్నారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆశయాలు పెట్టుకున్న ఓ జీవితం అర్థాంతరంగా ముగిసింది. రోహిత్ స్నేహితులు, ఫ్యామిలీ అభ్యర్థన మేరకు న్యాయం పోరాటం చేసేందుకు ఇక్కడకు వచ్చాను. పక్షపాతం, అన్యాయం నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్న ప్రతి భారతీయ విద్యార్థి ఆశయం కోసం కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి సామూహిక నిరాహార దీక్షలో పాల్గొన్న రాహుల్ ఇవాళ తన ట్విట్టర్‌లో ఈ కామెంట్స్ చేశారు. రెండు వారాల క్రితం దళిత విద్యార్థి రోహిత్ హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు రాహుల్ అప్పుడు కూడా హైదరాబాద్ వచ్చారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో శనివారం దేశంలోని యూనివర్సిటీలన్నింటిలోనూ సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను పదవుల నుంచి తొలగించాలని, హెచ్‌సీయూ వీసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ మహాత్మాగాంధీ వర్ధంతితో పాటు.. రోహిత్ పుట్టినరోజు కావడం యాధృశ్చికమే అయినా ఆసక్తికరమన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థులతో పాటు ఒకరోజు దీక్ష చేసిన ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో ఏదో ఒక రకంగా వివక్ష కొనసాగుతోందన్నారు. ప్రధాని మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ తమ భావాలను యువతపై బలవంతంగా రుద్దాలని చూస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరు వల్లనే రోహిత్ ఆత్మహత్య జరిగిందన్నారు. స్వేచ్ఛగా గొంతు విప్పే వారిని అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు రాహుల్. ఇప్పటికైనా యూనివర్సిటీల్లో వివక్షపై ప్రధాని మోడీ దృష్టి సారించాలన్నారు.మరోవైపు, విద్యార్ధి సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగించాయి. ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ముందు విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపట్టాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. అటు భోపాల్ లో కూడా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.రోహిత్ ఆత్మహత్యపై రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. యూనివర్సిటీలో రాహుల్ రాజకీయాలు చేస్తున్నారని, విద్యార్ధుల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. ఎంతో మంచి విద్యార్థిని కోల్పోయాం. రోహిత్ కుటుంబానికి అన్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా విశ్వ విద్యాలయాల్లో రోహిత్ లాంటివారు ఉన్నారు. సత్యం కోసం మాట్లాడే హక్కు, స్వేచ్ఛ రోహిత్‌కు ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకూడదు. రోహిత్‌కు జరిగిన అవమానం దేశంలో ఎవరికైనా జరగవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే కులవివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలి’ అని అన్నారు. భాజపా తన భావజాలాన్ని జనంపై రుద్దడానికి యత్నిస్తోందని ఆరోపించిన రాహుల్.. కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ చట్టం తీసుకురాకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో రాహుల్‌గాంధీతో పాటు లోక్‌సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా, రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజు, విద్యార్థులు దీక్షలో పాల్గొన్నారు. దిల్లీ జేఎన్‌యూ, మద్రాస్ యూనివర్సిటీ, ఇఫ్లూ, ఓయూ విద్యార్థులు, హెచ్‌సీయూ ఎస్సీ, ఎస్టీ ఫోరం అధ్యాపకులు దీక్షలో పాల్గొని మద్దతు తెలపగా, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమత సైనిక్ దళ్ కవాతు నిర్వహించి రోహిత్‌కు నివాళులర్పించారు.
రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ నేతలు..
హెచ్‌సీయూలో దీక్ష చేపట్టిన రాహుల్‌గాంధీకి మద్దతుగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. విద్యార్థుల డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, వంశీచందర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.