కూరగాయల ఉత్పత్తి పెంచేందుకే.. 

క్రాఫ్‌ కాలనీలు ఏర్పాటు
– మూడేళ్లలో డ్రిప్‌ ఇరిగేషన్‌ కు 2,400 కోట్లు ఖర్చు చేశాం
– వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : కూరగాయల ఉత్పత్తి పెంచేందుకే క్రాఫ్‌ కాలనీలను ఏర్పాటు చేయటం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలకు చెందిన 38 గ్రామాల కూరగాయాల రైతులు హాజరయ్యారు. హైదరాబాద్‌ నగరవాసుల డిమాండ్లకు అనుగుణంగా కూరగాయలు, ఆకుకూరల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై చర్చించారు. ఎస్సీలకు పూర్తి సబ్సిడీతో, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇస్తున్నామని మంత్రి పోచారం తెలిపారు. మన రైతుల ద్వారానే కూరగాయలు పండించాలనే ఉద్దేశంతోనే డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. కూరగాయల ఉత్పత్తి పెరగాలనే ఉద్దేశంతో క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మూడున్నరేళ్లలోనే డ్రిప్‌ ఇరిగేషన్‌ కు రూ. 2,400 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. కూరగాయల ఉత్పత్తి కోసం ఇబ్రహీంపట్నం క్రాప్‌ కాలనీ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 1.20 కోట్ల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా
ఉందన్నారు. విద్యుత్‌ మోటార్ల ద్వారా దాదాపు 50 లక్షల ఎకరాలు సాగు అవుతుందన్నారు. మరో 50 లక్షల ఎకరాలు ప్రాజెక్టుల కింద సాగు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు.