కూలింగ్‌ కెనాల్‌లో మృతదేహం

విజయవాడ, జూలై 26 : విటిపిఎస్‌ కూలింగ్‌ కెనాల్‌లో మృతదేహం బయటపడింది. ఎవరినో హత్య చేసి ఆ మృతదేహాన్ని కూలింగ్‌ కెనాల్‌లో పడవేసి ఉంటారని భావిస్తున్నారు. గురువారం ఉదయం కూలింగ్‌ కెనాల్‌ నీరు వడివడిగా ప్రవహించకపోవడంతో ఏదైనా అడ్డుపడిందేమోనన్న ఉద్దేశంతో విటిపిఎస్‌ సిబ్బంది కెనాల్‌ను పరిశీలించారు. ఈ తరుణంలో కెనాల్‌లో పడి ఉన్న మృతదేహం వారికి కనిపించింది. బుధవారం రాత్రి హత్య చేసి ఈ కెనాల్‌లో పడేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుని శరీరంపై గాయాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపర్చుకొని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని గుర్తించాల్సి ఉందని, ఈ ప్రాంతంలో ఎవరైనా అదృశ్యమై ఉంటే తమను సంప్రదించాలని ఇబ్రహీంపట్నం పోలీసులు కోరారు.