కృష్ణాపై కర్నా(నా)టకం

3

– అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటాం: టీఆర్‌ఎస్‌

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి):

ఆల్మట్టి తరహాలోనే మరోమారు కర్నాటక తన దాష్టీకాన్ని చాటుకుంది. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెలంగాణ ప్రతినిధులను అడ్డుకున్నారు. ఎంపి, మంత్రి అన్న ధ్యాస కూడా లేకుండా వారిని అడ్డుకున్నారు. గిరిజాపూర్‌ వద్ద కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టు పరిశీలనకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి మరికొందరు ప్రతినిధులతో కలసి అక్కడికి బయల్దేరారు.  అసలే వర్షాభావంతో కృష్ణా నది వెలవెలబోతుంటే.. కొద్దిపాటి నీరు సైతం కిందకు రాకుండా కర్ణాటక ప్రభుత్వం మోకాలడ్డుతున్న తీరు వాస్తవమేనని తేలింది. కృష్ణాపై మరో మినీ బ్యారేజీ నిర్మాణంతో వరద నీటిని ఒడిసిపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన పనులు చేపడుతోంది. ఈ క్రమంలో వీరు పరిశీలించేందుకు ప్రయత్నించగా రాయచూర్‌ జిల్లా శక్తినగర్‌ వద్ద జూపల్లిని, జితేందర్‌రెడ్డిని కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. కర్ణాటక ఉన్నతాధికారులతో జూపల్లి, జితేందర్‌రెడ్డి చర్చించారు. అయితే ప్రజాప్రతినిధులుగా ఉన్న తమను అడ్డుకోవడంపై కర్నాటక పోలీసులపై మంత్రి జూపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజాపూర్‌ ప్రాజెక్టును ఎలాగైనా చూసి తీరుతానని ఆయన పట్టుబట్టారు. అనుమతి లేదంటూ కర్నాటక పోలీసులు స్పష్టం చేశారు. దీనితో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి జూపల్లితో వెళ్లిన ఎంపీ జితేందర్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  చివరకు రాయచూర్‌ కలెక్టర్‌ తో మాట్లాడిన అనంతరం పరిమిత సంఖ్యలో వెళ్లవచ్చని అనుమతి వచ్చింది. చివరకు మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్‌ రెడ్డితో పాటు మరికొందరు ప్రాజెక్టును పరిశీలించేందుకు ప్రభుత్వ వాహనాల్లో వెళ్లేందుకు జిల్లా అధికారులు అనుమతించారు.

కృష్ణాపై మరో మినీ బ్యారేజీ నిర్మాణంతో వరద నీటిని ఒడిసిపట్టేందుకు కర్నాటక ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతోంది. రూ.150 కోట్లతో ఈ నిర్మాణం జరుగుతోంది. కేవలం రెండు సంవత్సరాల్లో దీని నిర్మాణం చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తెలంగాణ సర్కార్‌ అగ్గిలం విూద గుగ్గిలమయ్యింది. ఈ ప్రాజెక్టు వల్ల తీవ్ర సమస్యలు ఏర్పడుతాయని మంత్రి జూపల్లి అన్నారు. దీనిపై అఖిలపక్షం వేయాలని విపక్ష నేతలు కూడా డిమాండ్‌ చేశారు.ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డిలతోపాటు మరో ముగ్గురు ప్రాజెక్టును సందర్శించేందుకు కర్ణాటక అంగీకరించడంతో వారు పరిశీలన చేశారు. దాంతో కొంత వాగ్వాదం జరిగింది.ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులలో నీటి మట్టం దారుణంగా పడిపోయిన నేపద్యంలో వీరు ఈ పర్యటనకు వెళ్లారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే, కొత్త ప్రాజెక్టులు కర్నాటకలో వస్తే తెలంగాణలో మరింత సమస్య వస్తుందని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అలాగే ఎపిలో సమస్య వస్తుందని ఎపి ప్రభుత్వం భావిస్తున్నాయి.గిరిజాపూర్‌ వద్ద రోడ్‌ కమ్‌ బ్రిడ్జి పేరుతో దీనిని నిర్మిస్తున్నారు.ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటికే నిజనిర్దారణ కమిటీ నివేదిక సమర్పించింది. కర్ణాటక ప్రభుత్వం 194 గేట్లతో 1170 విూటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మిస్తున్నట్టు గుర్తించారు. బ్యారేజీలో రెండు టీఎంసీల నీరు నిల్వ చేసే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. కాగా, మొన్న జరిగిన సవిూక్షా సమావేశంలో మంత్రి హరీష్‌రావు ఈ ప్రాజెక్టు విషయమై పరిశీలించాలని మంత్రి జూపల్లిని, అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.