కృష్ణారెడ్డికి కన్నీటి వీడ్కోలు

1

మెదక్‌, ఆగస్ట్‌ 26 (జనంసాక్షి):

మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామం పంచగామలో అధికార లాంఛనాలతో ముగిసాయి. గ్రామస్థులు,నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. కిష్టారెడ్డి పెద్ద కుమారుడు సంజీవరెడ్డి ఆయన చితికి నిప్పంటించారు. అంత్యక్రియలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, వీహెచ్‌, భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు బాబూమోహన్‌, భాస్కరరావు, సంపత్‌కుమార్‌, హనుమంత్‌ షిండే, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్‌, పాతూరి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌, జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌, ఎస్పీ సుమతి, తదితరులు హాజరై కిష్టారెడ్డి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కిష్టారెడ్డిని కడసారి చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు భారీ ఊరేగింపు మధ్య ఆయన భౌతికకాయన్ని తరలించారు. కిష్టారెడ్డి అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది.