కృష్ణా జలాల వినియోగంపై ఎపి అనవసర పేచీలు

ఇప్పటికే విభజన సమస్యలతో సతమతమవుతున్న ఇరు తెలుగు రాష్టాల్ర మధ్య ఇప్పుడు కృష్ణాజలాల వివాదం మరింతగా ముదరడం ఆందోళన కలిగించేదిగా ఉంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆమోదించిన ప్రాజెక్టుల విషయంలో ఆనాటి పాలకులు తప్పుదోవ పట్టించారని అర్థం చేసుకోవాలి. కావాలనే తెలంగాణకు కేటాయింపుల పేరుతో, ప్రాజెక్టులత పేరుతో మోసం చేశారని అనుకోవాలి. ఇంతకాలం పాలమూరుకు కృష్ణా జలాలే అందని నేపథ్యంలో కేటాయింపులకు అనుగుణంగా నడుచుకుంటున్న దశలో ఎపి సిఎంచంద్రబాబు  మంత్రి దేవినేనిలు వ్యవహరిస్తున్న తీరు గిల్లికజ్జాలు పెట్టుకునేలా ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు కడుతున్నా చేవచచ్చిన సిఎంగా ఆనాడు చంద్రబాబు చేసిందేవిూ లేదు. కానీ ఈనాడు తెలంగాణ పట్ల ఆయన తనకున్న వ్యతిరేకతను చేతల్లో చూపాలనుకుంటున్న తీరు సరికాదు. నీటి సమస్యలపై చర్చిద్దామని తెలంగాణ జలవనరులశాఖ మంత్రి హరీష్‌ రావు పలుమార్లు దేవిననేనికి ఫోన్‌ చేసినా ఎందుకు రాలేదో చెప్పాలి. అంటే చర్చలకు భయపడుతున్నారా లేక కావాలనే తప్పించు కుంటున్నారా అన్నది ప్రజలకు తెలపాలి. ఎపి మంత్రి దేవినేనికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే, తెలుగువారం అంతా ఒకటే అనుకుంటే వెంటనే చర్చలకు రావాల్సి ఉంది. కానీ విూడియా ముందు మాట్లాడుతున్న మంత్రి ముఖాముఖికి రాకుండా తప్పించుకోవడం రాజకీయం కాక మరోటి కాదు. కృష్ణానది యజమాన్యబోర్డు తనపరిధిని దాటి వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చివరకు విధిలేక కేంద్రాన్ని ఆశ్రయించింది. ఏకపక్షంగా ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నదని  మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో, అధికార పార్టీ లోక్‌సభ సభ్యులంతా కలిసి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలిగించే విధంగా కృష్ణా నది యజమాన్యబోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసిందని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముసాయిదా నోటిఫికేషన్‌ను నిలుపుదల చేయాల్సిందిగా ఆదేశించాలని హరీష్‌ కోరారు. బోర్డు అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర జనవనరుల ముఖ్యకార్యదర్శిని కలిసి కృష్ణాబోర్డుపై ఫిర్యాదు చేయడంతో పాటు కేటాయింపుల మేరకే నీటిని వినియోగించేందుకు ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు.  కృష్ణా నది యజమాన్య బోర్డు ట్రిబ్యునల్‌ అధికారాన్ని సైతం తన పరిధిలోకి తెచ్చుకునేలా వ్యవహరిస్తోందని, ఇది చట్ట వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగలేదని,

గంపగుత్తగా కేటాయించిన విషయం తెలిసిందేనన్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇంకా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదన్నారు. ప్రస్తుతం రెండు రాష్టాల్ర వాదనలు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ వింటుందని, తీర్పు వెల్లడించాల్సి ఉందన్నారు. ఈ పక్రియ పూర్తికాకుండానే కృష్ణాబోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌ రూపొందించి, అమలుకు తుదిగడువు విధించడం చట్ట విరుద్ధమని హరీష్‌ రావు అన్నారు. కృష్ణానది యజమాన్య బోర్డు అనుసరిస్తున్నతీరు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ సర్కార్‌  ఏకపక్ష వైఖరిని అనుసరిస్తున్నదనిఏపీ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా 155 టీఎంసీలను అదనంగా వినియోగించు కోవాలని చూస్తోందని ఏపీ జలవనరులశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని తాము కూడా కేంద్ర జలవనరులశాఖ మంత్రిని కలిసి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వెల్లడిస్తామన్నారు. నిజానికి ఇంత గందరగోళం లేకుండా కూర్చుని చర్చించుకునే అవకాశాన్ని ఎపి మంత్రి దేవినేని ఎందుకు తోసిపుచ్చారో చెప్పాలి. ప్రజలను తప్పుదోవ పట్టించేకన్నా పరిష్కరించుకునే మార్గాలను చూడాలి. ఇతర సమస్యలను పక్కన పెట్టి దీనిని పెద్దదిగా చేసి చూపడం ద్వారా రాజీకయ లబ్ది పొందవచ్చేమో గాని నిజాలను కప్పిపుచ్చలేరు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటిని కేటాయించారని,

ఇందులో తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలు, సీమాంధ్ర ప్రాంతానికి 512 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా పరస్పర ఒప్పందం కుదిరిందని తెలంగాణ నేతలు వాదిస్తున్నారు.  రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కొత్తగా ప్రాజెక్టులు నిర్మించాలంటే కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలోని అపెక్స్‌ కమిటీ, కృష్ణాబోర్డు అనుమతి తప్పనిసరిన్న విషయాన్ని ఈ సందర్భంగా ఏపీ జలవనరులశాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టానికి విరుద్దంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్‌ ప్రారంభించిందని ఆరోపిస్తున్నారు. అదే నిజమయితే చర్చ చేయాలి. ఈ ప్రాజెక్టులను ఏపీ సర్కార్‌ అడ్డుకుంటుందని దుష్పప్రచారాన్ని చేయడం ద్వారా, తెలంగాణ ప్రభుత్వం 155 టీఎంసీల నీటిని అక్రమంగా వినియోగించుకునేందుకు ప్రణాళిక రచన చేస్తోందని ఏపీ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అంటున్నారు. ఒక వేళ ఇదీ నిజమయితే చర్చ చేయవచ్చు. రాష్ట్ర విభజన అనంతరం ఎటువంటి అనుమతలు లేకుండా 90 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, 30 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి విస్తరణ కోసం 15 టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా ప్లాన్‌ చేస్తోందని చెప్పారు. మిషన్‌ భగీరథ పథకానికి మరో 19.60 టీఎంసీల నీటిని వినియోగించుకోనుందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర జలవనరులమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నీటివిడుదలను కృష్ణా నది యజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కోరుతామన్నారు. కృష్ణానదీ యాజమాన్యబోర్డుపై తెలంగాణ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తూ తెలుగుప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి ఉమామహేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఇరువురు ఢిల్లీ వెల్లి చర్చించుకోవచ్చు. సమస్యను పరిష్కరించుకుంటారా? అందుకు చర్చిస్తారా అన్నది ముఖ్యం. ఆ దిశగా ఎపి నేతలు ఆలోచనచేయాలి.