కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

vijayawada

పెనుగంచిప్రోలు: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు రహదారిపై నుంచి కల్వర్టులో పడింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి.

క్షతగాత్రులను నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కు పోవడంతో ప్రయాణికులను బయటకు తీయడం సహాయక సిబ్బందికి కష్టంగా మారింది. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటం, అతివేగం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. భువనేశ్వర్లో 12 మంది, శ్రీకాకుళంలో 14 మంది, సీతంపేటలో 8 మంది, టెక్కలిలో ముగ్గురు, ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఇద్దరు, గాజువాకలో ఇద్దరు బస్సు ఎక్కినట్లు గుర్తించారు.

మృతుల్లో డ్రైవర్‌ ఆదినారాయణరెడ్డి(తాడిపత్రి), సంగా తులసమ్మ(శ్రీకాకుళం), షేక్‌ పాషా(విజయవాడ), మధుసూధన్‌ రెడ్డి(ఒడిషా), సోదరులు ఎన్‌ శేఖర్రెడ్డి, కృష్ణారెడ్డి(సూర్యాపేట) ఉన్నారు. క్షతగాత్రుల్లో 14 మందిని గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్స్‌కు తరలించారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్‌. యుగంధర్‌(38), కమల(61), రేవంత్‌(21), సీహెచ్‌ కిరణ్‌(27), అచ్యుత్‌ రావు(27), లక్ష్మీ నాయుడు(28), బల్దేవ్‌ సింగ్‌,  హైదరాబాద్‌కు చెందిన బాసిత్‌(49), ప్రశాంత్‌(28), కోటేశ్వర్‌ రావు(30), విజయవాడకు చెందిన ప్రవీణ్‌(26), కొండపల్లికి చెందిన పఠాన్‌ జాని(28), గుంటూరుకు చెందిన ఎమ్‌ కుమార్‌(37), భువనేశ్వర్కు చెందిన ఉత్తమ్‌(18) ఉన్నారు. దివాకర్‌ ట్రావెల్స్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.