కృష్ణా నీటి వాటాలు తేలాయి

4

– తెలంగాణ 299 టీఎంసీలు

-ఏపీకి 512 టీఎంసీలు

హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి):

రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో ఐదు అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నదిపై ప్రాజెక్టుల ప్రకారం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఖరారు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌ రావు తెలిపారు. ఈ అవగాహన ఒక సంవత్సరంపాటు అమలులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 298 టీఎంసీల నీళ్లు ఎక్కడైనా వాడుకునేలా చారిత్రక విజయం సాధించినమని విద్యాసాగర్‌ రావు చెప్పారు. ఇన్ని రోజుల తమ పోరాటం నీళ్ల కోసమే సాగిందన్నారు. నీటి లభ్యతను బట్టి వాడుకోవాలని, నీటిని వాడుకునే సమయంలో ఇతర రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదని నిర్ణయించినట్టు చెప్పారు. 811 టీఎంసీల కన్నా నీరు తక్కువైనా, ఎక్కువైనా ప్రాజెక్టుల నిష్పత్తి ప్రకారమే నీటిని వాడుకోవాల్సి ఉంటుందన్నారు.శ్రీశైలం, నాగార్జున సాగర్‌ లలో నీటి లభ్యతను బట్టి విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవాలని నిర్ణయించినట్టు విద్యాసాగర్‌ రావు వెల్లడించారు. ఆర్డీఎస్‌ కాల్వకు కేసీ కెనాల్‌ నుంచి వాటాకు మించి నీటిని తీసుకోకుండా నియంత్రించే పద్ధతిని బోర్డుకు అప్పగించినట్టు చెప్పారు. నిర్ణయాల అమలు, పర్యవేక్షణకు కృష్ణా బోర్డు మెంబర్‌, ఇరురాష్ట్రాల చీఫ్‌ ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. వారం, పది రోజులకు ఒకసారి కమిటీ సమావేశమై నీటి లభ్యతపై చర్చిస్తుందని విద్యాసాగర్‌ రావు తెలిపారు.