కృష్ణా పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
– ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,ఫిబ్రవరి 7(జనంసాక్షి):కృష్ణా పుష్కరాలకు పకడ్బందీ ఏరాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.గోదావరి పుష్కరాలు నిర్వహించిన విధంగానే కృష్ణా పుష్కరాలను ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో మంచి వర్షాలు కురిసే సమయంలో పుష్కరాలు జరుగుతున్నందున భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చెప్పారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి సవిూక్ష జరిపారు. గోదావరి పుష్కరాలు జరిగిన సమయం, ప్రదేశంతో పోలిస్తే కృష్ణా పుష్కరాలు భిన్నమైనవని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో కేవలం రెండు జిల్లాల్లోనే కృష్ణా నది ప్రవహిస్తోంది కాబట్టి కొద్దిపాటి ప్రాంతంలోనే ఎక్కువ పుష్కర ఘాట్లు నిర్మించాల్సి ఉంటుందన్నారు. దాదాపు 50 ఘాట్ల వరకు నిర్మించాలని చెప్పారు. కృష్ణా నది వరకు పోవడానికి రహదారుల సౌకర్యం కూడా సరిగా లేనందున, యుద్ధ ప్రాతిపదికన రహదారులు నిర్మించాలని చెప్పారు. రావడానికి, పోవడానికి వేర్వేరు దారులు కావాలని, వర్షా కాలం కావడం వల్ల రేగడి నేలల్లో వాహనాలు దిగబడే అవకాశం వుందని హెచ్చరించారు. కాబట్టి కాస్త గట్టి నేలల్లో పార్కింగ్ స్థలాలు, ¬ల్డింగ్ స్పేస్ లు ఏర్పాటు చేయాలన్నారు. క్రేన్లను అందుబాటులో ఉంచాలని, ఘాట్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కృష్ణా నదిలో మొసళ్లు ఉంటాయి కాబట్టు, జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఆలంపూర్ జోగులాంబ దేవాలయానికి భక్తులు ఎక్కువగా వస్తారని, కాబట్టి ఈ దేవాలయానికి యుద్ధప్రాతిపదికన రహదారులు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గంలో వుండే అన్ని దేవాలయాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరస్నానం చేసిన తర్వాత క్షేత్రదర్శనం సాంప్రదాయం కాబట్టి దేవాలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గోదావరి పుష్కరాలలో పనిచేసిన కలెక్టర్లు, ఇతర అధికారుల సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్, బీచుపల్లి, వాడెపల్లి, మట్టరుపల్లి, కొల్లాపూర్, సోమశిల, పెబ్బేరు, జూరాల తదితర ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లు సత్యనారాయణ, శ్రీదేవి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.