కృష్ణా పుష్కర సంరంభ వేళ ఇది

ఉత్తరాదిన కుంభమేళా ఎలానో మనకు అలా పుష్కరాలు నిర్వహించుకునే భాగ్యం కలిగింది. గతేడాది గోదావరి పుష్కరాలను ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా నిర్వహించుకోగా ఇప్పుడు కృష్ణా పుష్కరాలను నిర్వహించుకునే అదృష్టం కలిగింది. శ్రావణశుద్ద నవమి ప్రాతఃకాలవేళ శుక్రవారం నుంచి ప్రారంభం అయి ఈ నెల 23తో ముగుయనున్న కృష్ణవేణి పుష్కరాలకు రెండు రాష్ట్రాల్లో సర్వం సిద్ధం అయ్యింది. మన ఉనికికి కారణభూతమైన నదీమతల్లికి అందరూ ప్రేమాస్పదంగా అంజలి ఘటించే అరుదైన సందర్భం ఇది. పుణ్యస్నానాల కోసం కోట్లమంది భక్తులు తరలివచ్చే వేళ ఇది. మహారాష్ట్రలో పుట్టి, కర్ణాటకను దాటి మహబూబ్‌నగర్‌ ద్వారా తెలంగాణలోకి ప్రవేశించే కృష్ణమ్మ కర్నూలును స్పృశించి, నల్లగొండ విూదుగా గుంటూరు, కృష్ణాజిల్లాల వైపు సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన వాటికి ఎన్నో రెట్లు మిన్నగా కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు ఉండాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ పట్టుదలతో ఏర్పాట్లు చేయడం విశేషం. పుణ్యస్నానాలు ఆచరించి తర్పణాలు వదిలే వారికి ఈ పుష్కరాలు ఎంతో పవిత్రమైనవిగా గుర్తించాలి. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల గుండా పారుతున్న కృష్ణానది ఆంధ్రలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తుంది. పుష్కర పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పుష్కఘాట్లకు వచ్చే వచ్చే లక్షలాది మంది భక్తులు, యాత్రికులు ప్రశాంత వాతావరణంలో పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి వారివారి గమ్య స్థానాలకు క్షేమంగా వెళ్లాలనే సంకల్పంతోప్రత్యేక ఏర్పాట్లు చేసారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఘాట్ల సమాచారం, రైళ్లు, ప్రత్యేక బస్సుల సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

భక్తులు నదిలోకి వెళ్లి స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేకంగా భారీకేడ్లు సహితం ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆదేశంతో దేవాదాయ, ధర్మాదాయశాఖతో పాటు గ్రావిూణ తాగునీటి, పారిశుద్ధ్యంశాఖ, పంచాయితీరాజ్‌, పోలీసు, రెవెన్యూశాఖల అధికారులు పుష్కరఘాట్ల వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు. పుష్కరాల సందర్భంగా సవిూపంలోని చిన్నా, పెద్ద దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. బారికేడ్లు, క్యూలైన్లు, అలంకారాలతో ఏర్పాటు చేసింది. అలాగే పుష్కర ఘాట్ల వద్ద భక్తుల కోసం మరుగుదొడ్లను నిర్మించింది. అలాగే మహిళలు డ్రెస్‌లు మార్చుకునేందుకు ప్రత్యేకంగా గదులను నిర్మించారు. గత ఏడాదిలో గోదావరి పుష్కరాల సందర్భంగా తలెత్తిన ఇబ్బందులు కృష్ణానది పుష్కరాలలో తలెత్తకుండా జాగ్రత్తగా ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు భారీ ఎత్తున తరలివచ్చే భక్తులకు పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలతో పాటు రహదారుల వెంబడి ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. కొన్ని పుష్కరఘాట్ల వద్ద రద్దీ ఎక్కువ ఉంటే రద్దీలేని ఘాట్లకు భక్తులను మళ్లించేందుకు ఏర్పాట్లు సహితం చేశారు. పుష్కరఘాట్ల వద్ద పిండప్రదానం చేసేందుకు అర్చకులు, పిండసామాగ్రి ధరలను నియంత్రించేందుకు స్థానిక పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు, యాత్రికులు ప్రశాంత వాతావరణంలో పవిత్ర కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి వారివారి గమ్యస్థానాలకు క్షేమంగా వెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు, యాత్రికులు విజయవాడ చేరుకుంటారని భావిస్తున్న అధికారులు వారికి తగిన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నారు.

ప్రధానంగా సుదూర ప్రాంతాల ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వివిధ మార్గాల ద్వారా నగరానికి చేరుకోనుండగా, వారి కోసం అన్ని మౌలిక వసతులతో కూడిన పుష్కర నగర్లను ఏర్పాటు చేస్తున్నారు. పుణ్యస్నానాల కోసం వచ్చిన వారు 3 గంటల వ్యవధిలో ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది పుష్కరాలకు సర్వసిద్ధంగా ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై ఆయన ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల్లో అందరూ భాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల గుండా పారుతున్న కృష్ణానదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా ఏర్పాట్లు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 52, నల్గొండలో 29 ఘాట్లను ఏర్పాటు చేశారు.నల్లగొండ జిల్లాలో కోటిమంది, మహబూబ్‌నగర్‌లో రెండున్నర కోట్లమంది పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో- మొత్తం 81 స్నానవాటికలు నిర్మించిన తెలంగాణ ప్రభుత్వం పుష్కరాల నిమిత్తం రూ.630 కోట్లు ఖర్చు చేస్తోంది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 170 స్నానవాటికలు నిర్మించిన ఏపీ ప్రభుత్వం- మూడున్నర కోట్లమంది భక్తుల సౌకర్యాల నిమిత్తం రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది. పన్నెండు రోజులూ రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులను అన్నదానాలతో సమాదరించడానికి పలు సంస్థలు సంసిద్ధత చాటడంలో, స్వచ్ఛందసేవకు యువజనం వేలాదిగా ముందుకు రావడం మరో విశేషం.