కెటిఆర్‌కు సవాల్‌గా మున్సిపల్‌ ఎన్నికలు

నగరపాలక ఎన్నికలపై ఇప్పటికే కసరత్తు
గ్రేటర్‌ హైదరాబాద్‌పైనా దృష్టి
హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) : పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇప్పటికే పార్టీపై పట్టు బిగించిన కెటిఆర్‌, ఇక మున్సిపల్‌ మంత్రిగా రానున్న మున్సిపల్‌ ఎన్నికలను సవాల్‌గాతీసుకునే అవకాశం ఉంది. పార్టీ పరంగా ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికలపై ఆయన కసరత్తు మొదలు పెట్టారు. సభ్యత్వ నమోదుతో సహాఅనేక చర్యలుతీసుకున్నారు. బూత్‌కమిటీలుమొదలయ్యాయి. అలాగే ఇప్పుడు గ్రేటర్‌పైనా దృష్టి సారించారు. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పాలకవర్గం పదవీకాలం 2021 ఫిబ్రవరితో ముగియనుంది. అయితే, ఆ లోపే ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి పురపోరు ఆలస్యం కావడమే ముఖ్యకారణంగా కనిపిస్తోంది.  భాగ్యనగరిపై  దృష్టి సారించిన గులాబీదళం మరోసారి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ముందస్తు వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇటీవల హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం, కంటోన్మెంట్‌ బోర్డు సభ్యుల సమావేశాలను నిర్వహించడం ద్వారా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఈ మేరకు సంకేతాలిచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పార్టీ బలోపేతాన్ని సవాలుగా తీసుకుంటోంది. గ్రేటర్‌ పరిధిలో సభ్యత్వ నమోదు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. తానే స్వయంగా రంగంలోకి దిగారు. సభ్యత్వ నమోదు సంస్థాగత కమిటీల ఏర్పాటుపై దిశా నిర్దేశర చేశారు. గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలతో పలు పర్యాయాలు సమావేశమై డివిజన్‌, బస్తీ కమిటీలతోపాటు సోషల్‌ విూడియా కమిటీల ఏర్పాటు అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 నగర/పురపాలికల్లో జడ్చర్ల, నకిరేకల్‌ మినహా మిగతా మున్సిపాలిటీల కాలపరిమితి గత జూన్‌ 2వ తేదీతో ముగిసింది. కొత్త పురపాలక చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో వీటికి ప్రత్యేకాధికారులను నియమించింది. ఒకవైపు పురచట్టంపై కసరత్తు
చేస్తూనే.. మరోవైపు మున్సిపోల్స్‌కు సన్నాహాలు చేసింది. వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా రూపకల్పనలో చోటు చేసుకున్న పొరపాట్లపై పలువురు హైకోర్టును ఆశ్రయించడం తో పురపోరుకు బ్రేక్‌ పడింది. ప్రభుత్వ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఇప్పటికే పలుమార్లు విచారణ వాయిదా పడింది. కేసు తేలితే సరేసరి. లేనిపక్షంలో మున్సిపల్‌ ఎన్నికలతోపాటే బల్దియాకు కూడా నగారా మోగించే  అవకాశముంది.  శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో తిరుగులేని అధిక్యతను కనబరిచిన గులాబీ పార్టీ.. పురపాలికల్లోనూ అదే హవా కొనసాగించాలని చూస్తోంది. అయితే, వివిధ పార్టీల నేతల చేరికతో దూకుడు విూద ఉన్న బీజేపీని నిలువరించేందుకు మున్సిపల్‌ ఎన్నికలను వినియోగించుకోవాలని అనుకుంటోంది. ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీని చావుదెబ్బ కొట్టాలంటే సాధ్యమైనంత త్వరగా పురపోరును నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణాల్లో బీజేపీకి సంప్రదాయ ఓటుబ్యాంకు ఉంది. దీనికితోడు ఆర్టికల్‌ 370 రద్దుతో మోదీ ఇమేజ్‌ కూడా పెరిగింది. ఈ గ్రాఫ్‌ పెరగకుండా మున్సిపోల్స్‌తోపాటు గ్రేటర్‌ ఎన్నికలు త్వరగా ముగించడం ద్వారా బీజేపీ దూకుడుకు చెక్‌ పెట్టాలని టీఆర్‌ఎస్‌ యోచిస్తోంది. సామాజికమాధ్యమాల్లో బీజేపీకి దీటుగా కౌంటర్లు ఇవ్వడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వవాణిని గట్టిగా వినిపిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా డిజిటల్‌ సైన్యాన్ని రంగంలోకి దించింది. వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తోంది. హైదరాబాద్‌లో అభివృద్ధి పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్లై ఓవర్ల నిర్మాణం, ఎస్‌ఆర్‌డీపీ పనులు, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు లక్ష్యంగా నిర్ణయించింది.  ముందదస్తు ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ప్రస్తుత పాలకవర్గాన్ని రద్దు చేయాల్సివుంటుంది. అయితే, ప్రభుత్వానికి కేవలం ఆరు నెలల ముందు మాత్రమే కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం ఉంది. అదే కౌన్సిల్‌ మెజార్టీ సభ్యులు తీర్మానిస్తే మాత్రం వెంటనే పాలకవర్గం రద్దు కానుంది.