కెన్యా వర్శిటీపై ఉగ్రదాడి : 15 మంది మృతి
హైదరాబాద్ : కెన్యా ఉత్తర ప్రాంతంలోని గరిస్సా విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో విద్యార్థులు , సిబ్బంది గాయపడినట్టు తెలిసింది. పొద్దున 5.30కు ఉగ్రవాదులు వర్సిటీలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
గార్డులను చంపి…
వర్సిటీలో ప్రవేశించే ముందు ఉగ్రవాదులు ప్రవేశద్వారం వద్ద ఉన్న ఇద్దరు గార్డులను కాల్చివేశారు. అనంతరం వర్సిటీలోని వసతిగృహాల్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. వర్సిటీలో మొత్తం 900 విద్యార్థులు, సిబ్బంది వున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న కెన్యా భద్రతాదళాలు వర్సిటీని చుట్టుముట్టాయి. దుండగుల కోసం వేట ప్రారంభించారు.
బందీలుగా విద్యార్థులు
ఉగ్రవాదులు అనేకమంది విద్యార్థులుగా బందీలుగా పట్టుకున్నట్టు తెలిసింది. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు.వెనుకబడిన కెన్యా ఉత్తరప్రాంతంలో ఈ గరిస్సా విశ్వవిద్యాలయాన్ని కొద్ది కాలం క్రితమే నెలకొల్పారు.
అల్‌షబబ్ హస్తం
ఈ ఘటనకు తామే బాధ్యులమని సొమాలియాకు చెందిన ఉగ్రవాదసంస్థ అల్‌షబబ్ ప్రకటించింది. 2013లోను కెన్యా రాజధాని నైరోబీలో షాపింగ్‌మాల్‌పై జరిగిన దాడికి ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులే పాల్పడ్డారు. అల్‌ఖైదా స్ఫూర్తితో సొమాలియాలో నెలకొల్పిన అల్‌షబబ్‌అనేకమైన కిరాతక ఉగ్రవాదచర్యలకు పాల్పడింది.