కెసిఆర్ మాటలకు మోసపోవద్దు
తెలంగాణ ఉద్యమనేత కెకెను మోసం చేశారు
నేరెళ్ల దళితులను కేసులతో చితకబాదారు
సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డి ధ్వజం
సిరిసిల్ల,నవంబర్ 26(జనంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు నమ్మితే మోసపోతామని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా తెలంగాణ మారలేదని విమర్శించారు. సోనియా ఇచ్చిన తెలంగాణలో ప్రజల బతుకలు బాగు పడలేదన్నారు. సోమవారం ఆయన సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్.. ఓడిపోవాలని హరీశ్‌రావు కోరుకుంటున్నారని, వారిద్దరూ ఓడిపోతే తెరాస పగ్గాలు తన చేతుల్లోకి వస్తాయని ఆయన ఆశపడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఓడిపోయిన కేసీఆర్ ఫామ్ హౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోవాలని హరీశ్‌రావు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఓడించాలని.. హరీశ్‌రావు వంటేరు ప్రతాప్‌రెడ్డితో చర్చలు జరిపారన్నారు. బతుకమ్మ చీరలు సిరిసిల్లలో కొనుగోలు చేయకుండా సూరత్‌లో సిల్కు చీరలు కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఇంఉదలోనూ 150 కోట్లు నొక్కేశారని అన్నారు. తెలంగాణ పరిస్థితిని చూసి సోనియా గాంధీ తన కన్నీళ్లను కళ్లలోనే దాచుకున్నారని చెప్పారు. నేరెళ్లలో ఇసుక మాఫియాకు ఎదురు తిరిగిన ఎస్సీలను చిత్ర హింసలకు గురిచేశారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో పంటలకు గిట్టుబాటు ధరలు అడిగిన రైతులకు బేడీలు వేశారన్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కుటుంబంలో వ్యక్తులకే ప్రయోజనం కల్గింది తప్ప ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదన్నారు. సిరిసిల్లలో పేదరికాన్ని, నేతన్నల ఆత్మహత్యలను ఆపలేదన్నారు. కార్మికుల పేదరికాన్ని కూడా కవిూషన్లకు ఉపయోగించుకొనే వ్యక్తి కేటీఆర్ అని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత కూడా వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్నికూడా ఆదుకోలేదని, కనీసం పరామర్శించలేదని విమర్శించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60మంది మృతిచెందితే కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదని రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో పునాదిగా ఉన్న కెకె మహేందర్ రెడ్డిని కొడుకు కోసం పక్కన పెట్టారని అన్నారు. ఇలాంటి వారిని గమనించి మహేందర్‌ను గెలిపించాలని అన్నారు.




