కెసిఆర్‌ పథకాలను కాంగ్రెస్‌, బిజెపిలు ‘నకల్‌’ కొడుతున్నయ్‌!


ఐటీ, మున్సిపల్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌

. సిరిసిల్లలో బిఆర్‌ఎస్‌ నూతన కార్యాలయం ప్రారంభం
. కెసిఆర్‌ ను తిడితే ఓట్లు రావానీ పార్టీలు గుర్తించుకోవాలి
. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చించాలి
. 45 రోజులు మాకోసం పనిచేసి ఐదు సంవత్సరాలు మాతో పని చేయించుకోవాలి
. బిఆర్‌ఎస్‌ కార్యాలయాలు కార్యకర్తలకు భరోసాను ఇవ్వాలి
. నియోజకవర్గానికో కార్యాలయం నిర్మించుకుందాం

సిరిసిల్లలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నమని, పార్టీ శాశ్వతంగా ఉండాలనే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేస్తున్నామని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నేతలది మాత్రమే కాదని, ప్రతి బిఅర్‌ఎస్‌ కార్యకర్తదని చెప్పారు.

రాజన్నసిరిసిల్ల బ్యూరో, (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ బిజెపి పార్టీలు సీఎం కేసీఆర్‌ పథకాలను నకల్‌ కొడుతున్నాయని ఐటీ, మున్సిపల్‌, భారీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించిన భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్ని బిఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రెటరీ ఎంపీ కె.కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన పల్లి వినోద్‌ కుమార్‌ తో కలిసి ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యను పట్టణ అధ్యక్షులు జిధం చక్రపాణి కార్యాలయంలో వారి స్థానాల్లో కూర్చోబెట్టి అభినందించారు. అనంత రం జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కార్యకర్తలకు భరోసా కలిగించేలా జిల్లా కార్యాలయాలు ఉపయోగపడాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పార్టీ కార్యాలయా లు లేక ఇబ్బందులు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని కార్యాలయాలు నిర్మించుకోవలసిన అవసరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించారని అన్నారు. సీమాంధ్ర పాలనలో ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ పార్టీ కార్యాలయం కోసం తన నివాసాన్ని పార్టీ కోసం ఇస్తే ఆనాటి పాలకులు సామాన్లు బయటపడేసిన విషయం గుర్తు చేశారు. త్వరితగతిన జిల్లా కార్యాలయాన్ని పూర్తి చేయడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా కార్యాలయం నిర్వహించాలని సూచించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా పార్టీ కార్యాలయాలు నిర్మిస్తామని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌ రూపొందించి అమలు చేస్తున్న పథకాలను పేరు మార్చి కాంగ్రెస్‌ బిజెపిలు నాకల్‌ కొడుతున్నాయని అన్నారు. పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి బిఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో పై చేసిన విమర్శలను తప్పు పట్టారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుంటున్నాది వాస్తవం కాదా అని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను స్వల్పంగా పేర్లు మార్పు చేసి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని అన్నారు. రానున్న రోజుల్లో సిలిండర్‌ కు దండం పెట్టి బిజెపి డిపాజిట్లు గల్లంతు చేయాలని అన్నారు. 50 ఏళ్ల లో రైతుబంధు వంటి పథకాలను రూపొందించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి లేదని ఒక్క కెసిఆర్‌ కే ఉందని గుర్తు చేశారు. ఎన్నికల మనిఫెస్టో తమకు భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ లాంటి పవిత్రమైనదని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు. కార్యకర్తలు ఈ 45 రోజులు పనిచేసి తమతో ఐదు సంవత్సరాలు పని చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కెసిఆర్‌ మూడోసారి హైట్రిక్‌ సిఎం అయ్యేలా చూడాలని అన్నారు.
మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన చూసినప్పుడు సంతోషం గా ఉంటుందని ఉన్నారు. రాజ్యసభ సభ్యులు కేశవరావు మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే బలమని గుర్తు చేస్తూ భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల గెలుపు కోసం గ్రామస్థాయిలో ప్రభు త్వం అందిస్తున్న పథకాలను తీసుకువెళ్లి విష్క్రుతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్‌. చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్‌ తమ అనుభ వాలను కార్యకర్తలకు వివరించారు. కార్యక్రమం లో నాప్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్రావు, తెలంగాణ పవర్‌ లూం టెక్స్‌ టైల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, జెడ్పి చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళ, పలు నాయకులు జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.