కెసిఆర్ సెంటిమెంట్ జిల్లా కరీంనగర్ ను నాలుగు ముక్కలు చేసి రుణం తీర్చుకుండు..

కరీంనగర్ టౌన్ ఆగస్టు 30(జనం సాక్షి)

 

ముఖ్యమంత్రి కెసిఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ జిల్లా అయితే జిల్లాను ఏం చేసిండు …? నాలుగు ముక్కలు చేసి సెంటిమెంటు కరీంనగర్ జిల్లాకు ఏమి మిగిల్చకుండా సర్వనాశనంచేసి రుణం తీర్చుకున్నాడని బిజెపి నేత మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం ఎద్దేవా చేశారు. మంగళవారం కరీంనగర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కెసిఆర్ ఎనిమిదిన్నర ఏళ్ల పాలనలో సెంటిమెంట్ కరీంనగర్ జిల్లాకు ఏమీ చేయలేదన్నారు . లోగడ కరీంనగర్ జిల్లాకు ఉన్న గుర్తింపును లేకుండా చేశారని, జిల్లా గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమి మిగల్చలేదన్నారు. నిన్నటి రోజునపెద్దపెల్లి సభలో కెసిఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కాలేశ్వరం ప్రాజెక్టు గురించి సభలో ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు . కాలేశ్వరం ప్రాజెక్టు అంచనా వేయం పెంచి ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు నిర్మాణం చేశామని చెప్పుకునే కెసిఆర్ , ఇప్పుడు కాలేశ్వరం గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఎంతోమంది మేధావులు ఇంజనీర్లు కాలేశ్వరం తప్పిదాల గురించిహెచ్చరించిన కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని , నేడు కాలేశ్వరం కు ఏ లాంటి గతి పట్టిందో ప్రజలందరూ చూశారని తెలిపారు. ప్రపంచంలోనే అతి చెత్త ప్రాజెక్టు కాలేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి కనీసం ఒకటో తారీకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. లిక్కర్ అమ్ముకుంటే కానీ ప్రభుత్వం నడవలేని దుస్థితిలో కేసీఆర్ సర్కార్ ఉండడం సిగ్గుచేటన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి , ఆ బురదను బిజెపికి అంటగట్టాలనుకోవడం కెసిఆర్ మూర్ఖత్వం అన్నారు. కెసిఆర్ సర్కార్ అనేక చిక్కుల్లో ఉందని, లిక్కర్ ఆరోపణలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకత కప్పిపుచ్చుకోవడానికి రోజుకో నాటకం ఆడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదు అనే రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకొని కెసిఆర్ ఎన్నాళ్లు ఇలాంటి రాజ్యాన్ని నడుపుతారని ఆయన దుయ్యబట్టారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న కెసిఆర్ కుటుంబ పాలనను గద్దె దింపడానికి, తెలంగాణలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు ప్రజా సంగ్రామ యాత్ర చేపడితే ప్రభుత్వానికి వణుకు మొదలైందన్నారు . అందుకే బండి సంజయ్ కుమార్ ను ఓర్వలేక పోతున్నారని, ఆయనపై ఇష్టం వచ్చినట్లుగా అడ్డగోలుగా మాట్లాడడం వారి సంస్కారానికి నిదర్శనం లాంటిదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణను ఎనిమిదిన్నర ఏళ్లలో ఏం సాధించాడని , జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతుండని ఆయన ప్రశ్నించారు. అసలు కెసిఆర్ కు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలపడానికి ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వానికి ప్రజా ఆశీస్సులు ఉన్నాయని, అందుకే రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిందని, రాబోయే రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం నుండి బిజెపిని తరిమికొట్టడం కాదు ముందు తెలంగాణలో టిఆర్ఎస్ ని తరిమికొట్టే సమయం దగ్గర్లోనే ఉందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో కళ్లెం వాసుదేవ రెడ్డి, మేకల ప్రభాకర్ యాదవ్, కన్న కృష్ణ,కటకం లోకేష్,కళ్యాణ్ చంద్ర,మధు,దుబాల శ్రీనివాస్,కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, కచ్చు రవి, దుర్షెట్టి అనూప్,అవడుర్తి శ్రీనివాస్,నరహరి లక్ష్మారెడ్డి,మునిగంటి కుమార్,కైలాస నవీన్, సాయి,శ్రీధర్ మరియు తదితరులు పాల్గొన్నారు.