కేంద్రంలో ఏదీ తెలంగాణ వాయిస్
హైదరాబాద్,సెప్టెంబర్4(జనంసాక్షి): కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఒకరిని కూడా తొలగించి విస్తరణలో తెలంగాణకు స్థానం లేకుండా చేయడంతో ఇప్పుడు పార్టీ పరంగా ముందుకు వెళ్లడంలో ఇక ఇబ్బందులు తప్పవని పార్టీ నేతలు భావిస్తున్నారు. కేంద్ర సర్కార్‌లో తెలంగాణ వాయిస్ లేకుండా పోయిందన్న భావన పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఇంతకాలం తెలుగువాడిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడంతో కొంత వెలితి ఏర్పడిందని, ఇప్పుడు దత్తాత్రేయను కూడా తప్పించడంతో మరింతగా తెలంగాణను పక్కకు నెట్టేసినట్లుగా అయ్యిందని భావిస్తున్నారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న
వేళ, విబజన సమస్యలు వెన్నాడుతున్న తరుణంలో మనకంటూ ఓ ప్రతినిధి లేదా వాయిస్ లేకుండా చేశారని తెలంగాణ బీజేపీ నేతలను ఇది కలువరపెడుతోంది. అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శలకు ఇదో అవకాశంగా మారిందని మదన పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయను పక్కకు పెట్టడం, ఆ వెంటనే మురళీధర్ రావు, వెదిర శ్రీరాంల పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో ఆశాజనకంగా ఉన్న నేతల్లో ఇప్పుడీ చర్య తీవ్ర చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రివర్గంలో తమకు చోటు లభిస్తుందని కొంతకాలంగా ఎదురుచూసిన బీజేపీ నేతలు ఈ విస్తరణ మింగుడుపడడం లేదు. తెలంగాణకు ఒకటి, లేదా రెండు మంత్రి పదవులు లభిస్తాయని ఆశించగా ఉన్న ఒక్క పదవి కూడా ఊడటంతో పార్టీ వర్గాలలో నిరశాను పెంచింది. ఇక మంత్రి పదవి నుంచి వైదొలగిన దత్తాత్రేయ మాత్రంగవర్నర్‌గిరిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. అయితే ఆ గవర్నర్‌గిరి కూడా వస్తుందా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది. ఇప్పటికిప్పుడు దత్తాత్రేయతో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయించి గవర్నర్‌గా పంపించే సాహసం బీజేపీ చేస్తుందా అన్నది అనుమానమే. ఇదంతా దత్తాత్రేయను తప్పించడానికేనని అంటున్నారు. నిజంగా ఆయనను ఎందుకు పత్పించారన్నదానిపై ఎవరు కూడా కారణాలు చెప్పలేకపోతున్నారు. వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో చక్రం తిప్పుతామని బీరాలు పలుకుతున్న రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ శరాఘాతంగా మారింది. కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించే నేతలు కరువయ్యారు. కేంద్ర మంత్రి పదవిని ఆశించిన ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, జాతీయ పార్టీ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావులు భంగపడ్డారు. భవిష్యత్‌లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందో.. లేదో చెప్పలేం. తెలంగాణలో అంతంతమాత్రంగా ఉన్న బిజెపి ఇప్పుడు విస్తరణతో పరువు పోగొట్టుకుంది.