కేంద్రం నియంతృత్వం
– రాష్ట్రాలను సంప్రదించకుండా చట్టాలు ఎలా చేస్తారు!?:పవార్
దిల్లీ,డిసెంబరు 29 (జనంసాక్షి):రాష్ట్రాలను సంప్రదించకుండా వ్యవసాయ చట్టాలను తీసుకురావడం సరైన పద్దతి కాదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్వహించే చర్చల ఫలితాన్ని బట్టి ప్రతిపక్షాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు గత నెలరోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసింది. రాష్ట్రాలతో చర్చించాలి రైతుల ఆందోళనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను అవమానించడం సరికాదు. రైతు సంఘాలతో ప్రభుత్వం బుధవారం జరిపే చర్చల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలి. లేదంటే ప్రతిపక్షాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాయి. ప్రభుత్వం ఏవైనా సంస్కరణలు చేపట్టేటప్పుడు అన్ని రాష్ట్రాలతో చర్చించాలి. చర్చించాక అంతా సవ్యమే అనుకుంటేనే ముందుకు వెళ్లాలి. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు మేం కూడా సాగురంగంలో పలు సంస్కరణలు చేపట్టాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన విధంగా కాదు. అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, నిపుణులతో మేం సుదీర్ఘ చర్చలు జరిపాం.రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు వ్యవసాయం దిల్లీలో కూర్చుంటే జరిగే పని కాదు. మారుమూల గ్రామాల్లో రైతులు కష్టపడితే జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం పెద్ద బాధ్యత ఉంటుంది. కాబట్టి అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులను సంప్రదించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఆయా రాష్ట్రాల ప్రతినిధుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నమ్మకం కలిగించాలి. ఆ తర్వాతే ముందుకు వెళ్లాలి. ప్రభుత్వం రైతులతో చర్చలకు వ్యవసాయ రంగం గురించి తెలిసిన వారిని పంపించాలి. కేంద్రం రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒకవేళ కేంద్రం వారికి ప్రాధాన్యత ఇచ్చేటట్లయితే ఈ సమస్య ఇన్ని రోజులు కొనసాగేది కాదు. ప్రజాస్వామ్యంలో చర్చలు అనేవి జరపడం ఎంతో ముఖ్యం. చర్చలతోనే దేనికైనా పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాల ద్వారా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) వ్యవస్థ ముగిసిపోతుందని రైతులు అనుకుంటున్నారు. కాబట్టి ఆ సమస్యను ఉద్దేశించి ప్రభుత్వం వారికి స్పష్టమైన వివరణ ఇవ్వాలి. రైతుల ఆందోళనల్లో రాజకీయ పార్టీల హస్తం ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. కానీ ఆయన అలాంటి మాటలు అనడం సరికాదు. ఎందుకంటే రైతులు తమ నిరసనల్లోకి రాజకీయ నాయకుల్ని రావద్దని ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నిరసనలకు వచ్చి తమకు మద్దతు తెలపాలనుకుంటే రైతుగానే రావాలని వారు చెప్పారు. డిసెంబర్ 30 చర్చల ఫలితాన్ని బట్టి ప్రతిపక్షాల భవిష్యత్ కార్యచరణ ఉంటుందని శరద్ పవార్ ప్రకటించారు.