కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ కన్నుమూత


– గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అనంత్‌కుమార్‌
– చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి
– దిగ్భాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ, అమిత్‌షా
– సంతాపం తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు
న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) : కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అనంత్‌కుమార్‌ (59) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనంత్‌కుమార్‌ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనంత్‌కుమార్‌ 1959 జులై 22న కర్ణాటకలో జన్మించారు. ఆయన తొలిసారిగా 1996 సాధారణ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, మోదీ మంత్రివర్గంలో తొలుత ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముందే కేన్సర్‌ వ్యాధి సోకినట్టు నిర్దరణ కావడంతో లండన్‌, న్యూయార్క్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. అయితే, వ్యాధి ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో కొద్ది రోజులుగా వెంటిలేషన్‌పైనే ఉన్నారు. కాగా సోమవారం ఆరోగ్యం మరింత విషమించడంతో తుదిశ్వాస విడిరారు. అనంత్‌కుమార్‌ భౌతికకాయాన్ని లాల్‌బాగ్‌ రోడ్డులోని ఆయన నివాసానికి తరలించారు. ఉదయం 8 గంటల వరకు అక్కడే ఉంచి, అనంతరం ప్రజల సందర్శనార్ధం నేషనల్‌ కాలేజ్‌ గ్రౌండ్‌కు తరలించారు. మధ్యాహ్నం అనంత్‌కుమార్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మూడు రోజుల కిందట అనంత్‌కుమార్‌ భార్య తేజస్విని మాట్లాడుతూ… ఆయనకు మెరుగైన వైద్యం అందజేస్తున్నా, వ్యాధి తగ్గుముఖం పట్టడంలేదని అన్నారు. అయితే, చికిత్స స్పందిస్తున్నారని తెలిపారు. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తదితర ప్రముఖులు ఇటీవలే ఆయనను పరామర్శించారు. అనంత్‌కుమార్‌ మృతి పట్ల  ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, ఇతర బీజేపీ నేతలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరనే వార్తను బీజేపీ జీర్ణించుకోలేదని, కర్ణాటకతోపాటు దేశంలో బీజేపీ ఎదుగుదలకు ఆయన ఎంతగానో శ్రమించారని, బెంగళూరులో తమపార్టీకి ఆయన ఓ గుండెకాయలాంటివారని సీతారామన్‌ ట్వీట్‌ చేశారు. అనంత్‌కుమార్‌ లేనిలోటును పూడ్చేందుకు వారి కుటుంబానికి ఆ భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సంతాపం తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు..
కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సహా పలువురు భాజపా నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. ఇతర పార్టీల నేతలు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆయన మృతిపై సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేశారు. అనంత్‌ కుమార్‌ మృతి చాలా బాధాకరమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఇది ప్రజలకు, ముఖ్యంగా కర్ణాటక ప్రజలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అదేవిధంగా నా
విలువైన సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయానంటూ ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. చిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి వచ్చి ఎంతో శ్రద్ధ, దయతో సేవ చేసిన వ్యక్తి. ఆయన చేసిన గొప్ప పనులతో ఎప్పటికీ గుర్తుంటారని, ఆయన భాజపాకు గొప్ప ఆస్తి. కర్ణాటకలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయనకు చక్కని నిర్వహణ సామర్థ్యం ఉందని, చాలా మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు. అనంత్‌ కుమార్‌ మృతి ఎంతో బాధించిందని ఉపరాష్ట్ర ప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. త్వరలోనే కోలుకుని తిరిగి ప్రజాసేవ చేస్తారని అనుకున్నానన్నారు. ఆయన భార్య, పిల్లలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వెంకయ్య పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ జీ మరణించారన్న వార్త విచారానికి గురి చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నానని, ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అని ట్వీట్‌ చేశారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌సా, కేంద్ర మంత్రి ప్రశాఖ్‌ జవడేకర్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌, కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిలతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, ఇతర పార్టీల నేతలు అనంత్‌కుమార్‌ మృతికి సంతాపం తెలిపారు.