కేంద్ర ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపు
బంగారం బాండ్లకు కేంద్ర కేబినేట్ ఆమోదం
న్యూఢిల్లీ,సెప్టెంబర్9 (జనంసాక్షి):
బంగారం బాండ్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశంలో పలు అంశాలపై చర్చించిన మంత్రివర్గం స్పెక్టమ్ర్, కరువుభత్యం, బంగారం బాండ్ల పథకానికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం కరువుభత్యం(డీఏ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా టెలికం సంస్థలకు ఊతమిచ్చే దిశగా కేంద్ర మంత్రివర్గం చర్యలు చేపట్టింది. వినియోగంలో లేని స్పెక్టమ్ర్ కొనుగోలుపై విధివిధానాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానంతో కాల్ డ్రాప్ సమస్యలు తగ్గనున్నాయి. బంగారం బాండ్ల పథకానికి సంబంధించి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వివరాలను తెలుపుతూ… బంగారం బాండ్ల పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందన్నారు. బంగారం ధరకు సమానంగా బాండ్ల జారీకి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 5, 10, 50, 100 గ్రాముల లెక్కన బాండ్ల జారీకి నిర్ణయించామన్నారు. బంగారం బాండ్లను ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేస్తుందన్నారు. దీంతో బంగారం స్థానంలో అదే విలువకు బాండ్లు కొనుగోలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.