కేంద్ర ప్రతిపాదనలు తిరస్కరణ

– 14న మళ్లీ దేశవ్యాప్త ఆందోళన

– రైతు సంఘాల నిర్ణయం

దిల్లీ,డిసెంబరు 9 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తాము ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు స్పష్టంచేశాయి. చట్టాలను రద్దు చేసే యోచన లేదని, సవరణలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను కేంద్రం పంపిన నేపథ్యంలో రైతు సంఘాలు తమ వైఖరిని కేంద్రానికి తెలియజేశాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని పునరుద్ఘటించాయి. ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని సుస్పష్టంగా ప్రకటించాయి. చట్టాల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గని నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు రైతు సంఘాల నేతలు బుధవారం సాయంత్రం విూడియాకు తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్‌ 12న దిల్లీ- జైపూర్‌, దిల్లీ-ఆగ్రా జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద ఆందోళన చేస్తామన్నారు. 12 తర్వాత భాజపా నాయకులను ఘొరావ్‌ చేస్తామని, 14న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల రైతులు కూడా దిల్లీలో ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సవరణలకు ఒప్పుకోబోం: రైతు సంఘాలు

ప్రభుత్వం నుంచి నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన ప్రతిపాదనల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా తెలిపారు. చట్టాల్లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనల్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. నేడు మరోసారి రైతు సంఘాలన్నీ భేటీ కానున్నాయని తెలిపారు. ప్రభుత్వం పంపిన రాతపూర్వక ప్రతిపాదనలపై చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే రేపు చర్చలు జరుపుతామన్నారు. ఈరోజు సర్కార్‌తో ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. కేంద్ర వైఖరిని బట్టి ఆందోళనలను ముందుకు తీసుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. నేడు సాయంత్రం 4 లేదా 5 గంటల కల్లా రైతు సంఘాలు తమ నిర్ణయాల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రతిపాదనలివే…

కొత్త సాగు చట్టాల్లో పలు సవరణలను అంగీకరిస్తూ కేంద్రం నేడు రైతు సంఘాలకు రాతపూర్వక ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా సవరణ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఏపీఎంసీల్లో ఒకే ట్యాక్స్‌ సవరణకూ సానుకూలంగా స్పందించింది. ప్రైవేటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసేలా చట్టంలో మార్పులు చేస్తామని తెలిపింది. ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా నిబంధనల్ని సవరిస్తామని పేర్కొంది. వ్యాపారులు-రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో ఎస్‌డీఎంల అధికారాల సవరణకు సైతం కేంద్రం సుముఖత తెలిపింది. ఒప్పంద వ్యవసాయంలో సివిల్‌ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించేలా మార్పులు చేస్తామని ప్రతిపాదించింది. ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూముల రక్షణకు హావిూ కల్పిస్తామని తెలిపింది. కనీస మద్దతు ధరపైనా రాతపూర్వక హవిూకి ప్రభుత్వం అంగీకరించింది. పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్‌, హరియాణా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. మంగళవారం రైతు సంఘాలతో భేటీ అయిన కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా చట్టాలను రద్దు చేయడం కుదరదని తెలిపారు. కొన్ని సవరణలకు మాత్రం అంగీకరిస్తామన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలను నేడు రైతు సంఘాలకు పంపుతామని తెలిపారు. ఆ మేరకు నేడు కేంద్రం రాతపూర్వకంగా సవరణలను రైతు సంఘాలకు పంపింది.