కేంద్ర ప్రభుత్వం విధానాలతో పడిపోతున్న రైతుల ఆదాయం – మండిపడ్డ రాహుల్‌

దిల్లీ,డిసెంబరు 11 (జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల ఆదాయం గురించి విూడియాలో వచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులందరూ పంజాబ్‌ రైతుల్లా ఆదాయం పెంచుకుందామంటే.. మోదీ ప్రభుత్వం వారి ఆదాయాలను బిహార్‌ రైతుల మాదిరిగా చేద్దామనుకుంటోందని మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ ప్రధాని మోదీ హావిూ ఇచ్చిన నేపథ్యంలో రాహుల్‌ ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు రైతుల ఆదాయాలకు సంబంధించిన పట్టికను ట్వీట్‌ చేశారు.

ఆ నివేదిక ప్రకారం.. దేశంలోని సగటున ప్రతి రైతు కుటుంబం ఏటా రూ.77,124 అర్జిస్తోంది. అదే సమయంలో పంజాబ్‌లోని రైతు కుటుంబం ఏటా రూ.2,16,708 ఆదాయం పొందుతుండగా.. బిహార్‌లో అత్యల్పంగా ఒక రైతు కుటుంబం రూ.42,684 మాత్రమే పొందుతోందని ఆ నివేదిక పేర్కొంది. దీన్ని ఉదహరిస్తూ ప్రతి రైతు కుటుంబ ఆదాయం బిహార్‌ రైతుల మాదిరిగా మార్చాలని కేంద్రం చూస్తోందని రాహుల్‌ విమర్శించారు. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాల వల్ల వ్యవసాయ మార్కెట్లు మూత పడతాయని, కనీస మద్దతు ధర అనేది రైతులకు దూరమవుతుందని ఆ పార్టీ వాదిస్తుండగా.. ఈ చట్టాలు రైతుల ఆదాయం పెంచుతాయని ప్రభుత్వం చెబుతోంది.