కేంద్ర మంత్రి వర్గ విస్తరణ

– 9 కొత్త ముఖాలు.. నలుగురు పాతవారికి ప్రమోషన్‌

దిల్లీ,,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రిమండలిని పునర్‌ వ్యవస్థీకరించారు. కొత్తగా 9 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆదివారం ఉయదం 10.30 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.అశ్వినికుమార్‌ చౌబే, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, శివప్రతాప్‌ శుక్లా, హర్దీప్‌సింగ్‌పూరి, సత్యపాల్‌సింగ్‌, రాజ్‌కుమార్‌సింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌తనం, వీరేంద్రకుమార్‌, అనంత్‌కుమార్‌ హెగ్డే కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్త మంత్రుల వివరాలు..

శివ్‌ప్రతాప్‌ శుక్లా: ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రావిూణాభివృద్ధిశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్నారు. 1989, 1991, 1993, 1996ల్లో వరుసగా నాలుగుసార్లు యూపీ శాసనసభ్యునిగా ఉన్నారు. ఎనిమిది ఏళ్లపాటు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. గ్రావిూణాభివృద్ధి, విద్య, జైళ్ల సంస్కరణల్లో మంచి అనుభవం ఉంది. గోరఖ్‌పూర్‌ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం చదివారు. 1970ల్లో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అత్యయిక పరిస్థితుల సమయంలో 19 నెలలపాటు జైలుకు వెళ్లివచ్చారు.

అశ్విని కుమార్‌ చౌబే: బిహార్‌లోని బక్సర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్లమెంటు అంచనాల కమిటీలో, ఇంధన కమిటీ స్థాయీ సంఘంలో, కేంద్ర సిల్క్‌ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. బిహార్‌ అసెంబ్లీకి వరుసగా అయిదుసార్లు ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంలో వైద్యం, పట్టణాభివృద్ధి, ప్రజారోగ్యం, ఇంజనీరింగ్‌ మంత్రిగా ఎనిమిది ఏళ్లపాటు సేవలందించారు. పట్నా యూనివర్శిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా విజయం సాధించి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1970లో జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అత్యయిక పరిస్థితుల సమయంలో జైలుకెళ్లారు. ”ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, అప్పుడే ఆడపిల్లల కన్యాదానం” అనే నినాదం ఇచ్చారు. మహా దళిత్‌ కుటుంబాలకు 11 వేల మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. 2013లో కేదార్‌నాథ్‌ ప్రకృతి విలయాన్ని కుటుంబంతో సహా ప్రత్యక్షంగా చూశారు. ఆ విపత్తుపై పుస్తకం రాశారు. బీఎస్సీ చదివారు. యోగాలో మంచి ఆసక్తి ఉంది.

వీరేంద్ర కుమార్‌ (ఎస్సీ): మధ్యప్రదేశ్‌లోని టికంఘా లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కార్మిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా ఉన్నారు. లాభదాయక పదవుల వివాదంలో సంయుక్త సంఘానికి ఛైర్మన్‌గా పనిచేశారు. జాతీయ సామాజిక భద్రత మండలి సభ్యుడిగా సేవలందించారు. ఎస్సీ, ఎస్టీ, కార్మిక సంక్షేమశాఖ, హక్కుల సంఘం, పెట్రోలియం- సహజ వాయువుల శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా పనిచేశారు. ఈయన కూడా 70వ దశకంలో జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల సమయంలో 16 నెలలపాటు జైలుకెళ్లారు. విద్యార్థులకోసం ఒక గ్రంథాలయం కూడా నిర్వహించారు. ఎస్సీల జీవన స్థితిగతుల మెరుగుకోసం జీవితాన్ని అంకితం చేశారు. ఎంఏ చదివారు. బాలకార్మిక వ్యవస్థపై పీహెచ్‌డీ పూర్తిచేశారు.

అనంత కుమార్‌ హెగ్డే: కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్నారు. 28 ఏళ్ల వయస్సులోనే తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం 5వసారి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆర్థిక, ¬ం, మానవ వనరులు, వాణిజ్యం, వ్యవసాయ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా సేవలందించారు. సుగంధ ద్రవ్యాల మండలి సభ్యుడిగా నాలుగుసార్లు పనిచేశారు. గ్రావిూణ భారతంపై మంచి అవగాహన ఉంది. గ్రావిూణాభివృద్ధి కోసం కదంబ అనే ఎన్‌జీవోను స్థాపించారు. తైక్వాండో, కొరియా మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉంది.

రాజ్‌కుమార్‌ సింగ్‌: 1975వ బ్యాచ్‌ బీహార్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. కేంద్ర ¬ంశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం బిహార్‌లోని ఆరా లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైద్య ఆరోగ్యం, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, న్యాయశాఖల పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్నారు. రక్షణ ఉత్పత్తుల విభాగం కార్యదర్శిగానూ పనిచేశారు. బిహార్‌ ప్రభుత్వంలో ఉండగా ¬ం, పరిశ్రమలు, ప్రజా పనులు, వ్యవసాయ శాఖల్లో సేవలందించారు. పోలీసులు, జైళ్ల ఆధునీకరణలో మంచి అనుభవం ఉంది. ¬ంశాఖ కార్యదర్శిగా ఉండగా వీటిపై ఎక్కువ దృష్టి సారించి పనులు చేయించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఒక ప్రణాళిక రూపొందించారు. దిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రుడయ్యాక న్యాయశాస్త్రం చదివారు. నెదర్లాంండ్స్‌లోని ఆర్‌వీబీడెల్ట్ఫ్‌ యూనివర్శిటీలో ఉన్నత చదువులు అభ్యసించారు.

హర్‌దీప్‌సింగ్‌ పూరి: 1974 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం ఏ సభకూ ప్రాతినిథ్యం వహించడంలేదు. విదేశీ విధానాలు, జాతీయ భద్రత అంశాల్లో పూర్తిస్థాయి అనుభవం, నైపుణ్యం ఉంది. ప్రస్తుతం ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిశోధన-సమాచార వ్యవస్థ’ (ఆర్‌ఐఎస్‌)కు ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ శాంతి సంస్థ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. దౌత్య రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. బ్రెజిల్‌, యూకే, ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా పనిచేశారు. జెనీవాలో భారత్‌ తరఫున శాశ్వత సభ్యుడిగా సేవలందించారు. భద్రతా మండలికి భారత్‌ తరఫున వెళ్లిన బృందానికి నేతృత్వం వహించారు. యూఎన్‌ ఉగ్రవాద వ్యతిరేక కమిటీకి, భద్రత మండలికి ఛైర్మన్‌గా పనిచేశారు. దిల్లీ యూనివర్శిటీలోని హిందూ కళాశాలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. జేపీ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక కాకముందు దిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాలో కొంతకాలం బోధన కూడా చేశారు.

గజేంద్రసింగ్‌ షెకావత్‌: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్నారు. ఫెలోషిప్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. సాంకేతిక రంగంలో నైపుణ్యం ఉంది. ప్రగతిశీల రైతు. సాధారణ జీవనశైలికి నిదర్శనం. ప్రఖ్యాత ఖోరా (బ్లాగింగ్‌ సైట్‌)లో అత్యధికమంది అనుసరిస్తున్న రాజకీయ నాయకుడు. సామాజిక సేవలో మంచి పేరుంది. క్రీడాభిమాని. జాతీయ స్థాయిలో బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. అఖిల భారత క్రీడా మండలి సభ్యుడిగా ఉన్నారు. అఖిల భారత బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. జోధ్‌పూర్‌లోని జైనారాయణ వ్యాస్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎంఫిల్‌ చేశారు.

సత్యపాల్‌ సింగ్‌: ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌ లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ¬ంశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన 1980వ బ్యాచ్‌ మహారాష్ట్ర కేడర్‌ ఐపీఎస్‌ అధికారి. అంతర్గత భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో పతకాలు గెలుచుకున్నారు. 1990లో ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోని నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక సేవలు అందించారు. గిరిజనుల సమస్యలు, మావోయిస్టుల ఉద్యమంపై పుస్తకం రాశారు. వేదం, సంస్కృతంలో ప్రావీణ్యం ఉంది. ఆధ్యాత్మికత, మతం, అవినీతిపై తరచుగా ప్రసంగాలు చేస్తుంటారు. ఎమ్మెస్సీ, ఎంఫిల్‌ చేశారు. స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌లో ఆస్ట్రేలియా నుంచి ఎంబీఏ, ప్రజా పరిపాలనలో ఎంఏ, నక్సలిజంపై పీహెచ్‌డీ చేశారు.

అల్ఫోన్స్‌ కన్నన్‌థానం: 1979 బ్యాచ్‌, కేరళ కేడర్‌ ఐఎఎస్‌ అధికారి. న్యాయవాది కూడా. దిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆక్రమణ కూల్చివేతలు చేపట్టి ‘దిల్లీ డెమాలిషన్‌ మ్యాన్‌’గా పేరుపొందారు. సుమారు 15వేల అక్రమ భవనాలను కూలగొట్టారు. 1994లో టైమ్‌ మేగజైన్‌ ప్రచురించిన 100 మంది ప్రపంచ యువ నేతల జాబితాలో ఈయనకు స్థానం దక్కింది. కొట్టాయం జిల్లాలో విద్యుత్తు సౌకర్యం లేని మనిమాల గ్రామంలో జన్మించారు. కలెక్టర్‌గా ఉన్నప్పుడు 1989లో కొట్టాయంను 100% అక్షరాస్యత పట్టణంగా నిలిపారు. 1994లో జన్‌శక్తి ఎన్‌జీవో ఏర్పాటుచేసి ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా పనిచేసేలా పోరాడారు. 2006, 2011ల్లో కేరళలోని కంజిరాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ‘2017 విద్యా విధానం’ రూపకల్పన కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ‘మేకింగ్‌ ఏ డిఫరెన్స్‌’ పేరుతో పుస్తకం రాశారు.

? కేబినెట్‌ మంత్రులుగా పదోన్నతి లభించింది వీరికే..

నిర్మలా సీతారామన్‌ : ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నిర్మలా సీతారామన్‌ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని మధురైలో జన్మించారు. తిరుచురాపల్లిలోని సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో బీఏ చేశారు. ఆ తర్వాత ఎకనామిక్స్‌లో ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేశారు. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా కూడా ఆమె సేవలందించారు. భాజపాలో వివిధ స్థాయిల్లో పనిచేసి పార్టీ అధికార ప్రతినిధిగా మంచి గుర్తింపు పొందిన నిర్మలా సీతారమన్‌ 2014లో మోదీ నేతృత్వంలో భాజపా అపూర్వ విజయంతో ఆయన జట్టులో కేంద్ర సహాయ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. తనకు కేటాయించిన వాణిజ్య శాఖలో మెరుగైన పనితీరు కనబర్చి ఇప్పటి పునర్‌వ్యవస్థీకరణలోనూ చోటు దక్కించుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్‌కు ఆమె సతీమణి.

ధర్మేంద్ర ప్రదాన్‌: కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ¬దా)గా పనిచేసి కేబినెట్‌ ¬దా పొందిన ధర్మేంద్ర ప్రదాన్‌ ఒడిశాకు చెందినవారు. 1969 జూన్‌ 26న ఆయన జన్మించారు. భువనేశ్వర్‌లోని ఉత్కళ్‌ విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీలో ఎంఏ పూర్తిచేసిన ధర్మేంద్ర ప్రదాన్‌ ఆ తర్వాత భాజపాలో సభ్యత్వం పొందారు. భాజపాలోని వివిధ విభాగాల్లో పనిచేసిన ప్రదాన్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అమిత్‌షాకు ఆయన విశ్వాసపాత్రుడిగా పేరుంది. బిహార్‌ రాష్ట్రం నుంచి 2012 మార్చిలో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఒడిశాలోని పల్లాల్‌హర నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన తండ్రి డాక్టర్‌ దేవేంద్ర ప్రదాన్‌ కూడా భాజాపా ఎంపీగా పనిచేశారు. 2014 తొలి కేబినెట్‌ విస్తరణలో చోటు దక్కించుకున్న ధర్మేంద్ర ప్రదాన్‌ తన శాఖలో అద్భుతమైన పనితీరు కనబర్చడం ద్వారా నేటి పునర్‌ వ్యవస్థీకరణలోనూ చోటు దక్కించుకోవడం విశేషం.

పీయూష్‌ గోయల్‌: నరేంద్ర మోదీ కేబినెట్‌ విస్తరణలో పదోన్నతి పొందిన కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ¬దా) పీయూష్‌ 1964 జూన్‌ 13న ముంబయిలో జన్మించారు. ఆయన తండ్రి వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ కూడా మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గోయల్‌ గొప్ప మేధావి. చార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఆలిండియా రెండో ర్యాంకు సాధించారు. అంతేకాకుండా ముంబయి వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో రెండో ర్యాంకు సాధించారు. యేల్‌ వర్సిటీ, ఆక్స్‌ఫర్డ్‌, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీల్లో ఆయన నాయకత్వ సదస్సుల్లో పాల్గొన్నారు. తన 28 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో భాజపాలో పలు కీలక స్థాయిల్లో పనిచేశారు.2016లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ: ప్రస్తుతం భాజపా ఉపాధ్యక్షుడు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి (స్వతంత్ర ¬దా)గా ఉన్న అబ్బాస్‌ నఖ్వీకి పదోన్నతి లభించింది. తన శాఖలో మంచి పనితీరు కనబర్చడంతో ఆయనను మోదీ తన కొత్త జట్టులోకి తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1957లో జన్మించిన నఖ్వీ 1983లో ఓ హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న నఖ్వీ మహారాష్ట్ర జైలుకు వెళ్లారు. అప్పుడు ఆయన వయస్సు 17 ఏళ్లు. విద్యార్థి నాయకుడిగా జనతాపార్టీలో కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిసారి జనతాపార్టీ (సెక్యులర్‌) నుంచి 1980లో పోటీచేసిన ఆయన ఓటమిపాలయ్యారు. అయోధ్య లోక్‌సభ స్థానం నుంచి 1980లో స్వతంత్ర అభ్యర్థిగానూ పోటీచేశారు. ఆ తర్వాత 1998 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన నఖ్వీ వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 మే 26న మోదీ కేబినెట్‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది నజ్మాహెప్తుల్లా రాజీనామా చేయడంతో ఆమె నిర్వహించిన మైనార్టీ సంక్షేమ శాఖ బాధ్యతలను కూడా మోదీ నఖ్వీకే అప్పగించారు.