కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించండి
నిజామాబాద్, అక్టోబర్ 16 (ఎపిఇఎంఎస్): అధిక ధరలు, పన్నుల భారంతో ప్రజల నడ్డివిరుస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోటయ్య పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం రెండో దఫా సంస్కరణల పేరుతో ప్రజలపై పలు భారం పెట్టేందుకు సిద్ధమవుతుందని విమర్శించారు. వంటగ్యాస్ ధరను, డీజిల్ ధరలను పెంచి, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడా పెట్టుబడుదారులకు ఐదులక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని, ఇందులో రిలయన్స్ సంస్థకే 80 వేల కోట్ల రూపాయలను అందజేసిందని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అమెరికాను గట్టేకించడానికి భారత రూపాయి విలువను తగ్గించి భారతదేశ ప్రజలను దివాలా తీయించారని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దుర్మార్గ చర్యలకు వ్యతిరేకంగా ప్రజాందోళనకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.