కేజ్రీవాల్ ఆఫీస్‌పై సీబీఐ దాడి, సీజ్: మోడీది పిరికి చర్య

4న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయం పైన సిబిఐ మంగళవారం దాడి చేసింది. ఆయన కార్యాలయాన్ని సీజ్ చేసింది. సిబిఐ సోదాలను కేజ్రీవాల్ ధృవీకరించారు. ఢిల్లీ సచివాలయంలో సీబీఐ జరుపుతున్న సోదాలు కలకలం పుట్టిస్తున్నాయి. సీబీఐ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయం, ఇతర మంత్రుల చాంబర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సోదాల పైన కేజ్రీవాల్ భగ్గుమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీది పిరికిపంద చర్య అని ధ్వజమెత్తారు.

రాజకీయంగా తనకు ఎదురునిలిచే సత్తా లేకనే ప్రధాని మోడీ ఈ తరహా దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంపై సీబీఐ దాడులు రాజకీయ కుట్రేనన్నారు. సిబిఐ తీరుపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు భయపడేదిలేదని చెప్పారు. కేజ్రీవాల్ కార్యాలయాన్ని సీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సీబీఐ అధికారులు, మరెవ్వరినీ కార్యాలయ గదిలోకి రానీయడం లేదు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకే ఈ సోదాలు నిర్వహిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా కార్యదర్శి పైన సోదాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కార్యదర్శి పైన దాడులు నిర్వహించిన సీఎం కార్యాలయంపై దాడి చేసినట్లే అన్నారు.