కేటీఆర్‌కు మున్సిపల్ శాఖ కేటాయింపు
హైదరాబాద్,ఫిబ్రవరి 7(జనంసాక్షి): హైదరాబాద్‌లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు మరో కీలక శాఖ దక్కింది. ఆయనకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఉన్న ఈ శాఖను మంత్రి కేటీఆర్ కు ఆయన అప్పగించారు.జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా గత నెల 30న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన టిఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను వారంలోనే అమలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార బాధ్యతను భుజానికెత్తుకున్న మంత్రి కేటీఆర్.. నగరమంతా పర్యటించారు. ప్రతి బస్తీలో ప్రజల సమస్యలు తెసుకున్నారు కాబట్టి వాటి పరిష్కారం బాధ్యతను కూడా ఆయనకే అప్పగిస్తానని ముఖ్యమంత్రి ఆ రోజు సభలో వేదికపై నుంచే ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అద్భుత విజయం సాధించడంలో మంత్రి కేటీఆర్ కీలకపాత్ర పోషించారు.