కేటీఆర్‌.. చెల్లి, భావతో కలిసి.. తెలంగాణ ఆస్తులను దోచుకున్నారు


– నాలుగేళ్లలో కేటీఆర్‌ ఆస్తులు 400శాతం ఎలా పెరిగాయి?
– దోచుకున్న డబ్బును మలేసియా, సింగపూర్‌లకు తరలించారు
– తేజారాజు అనే వ్యక్తితో కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు
– దీనిపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధంగా ఉన్నా
– దమ్ముంటే కేటీఆర్‌ చర్చకు రావాలి
– కవిత, హరీష్‌రావుల అక్రమాస్తుల వివరాలను బయటపెడతా
– కాంగ్రెస్‌ నేత మధుయాష్కీగౌడ్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌1(జ‌నంసాక్షి) : కేటీఆర్‌.. చెల్లి, భావతో కలిసి తెలంగాణ ఆస్తులను దోచుకున్నారని, ఫలితంగా నాలుగేళ్లలో 400శాతంమేర తను ఆస్తులను పెంచుకున్నాడని కాంగ్రెస్‌ నేత మధుయాష్కిగౌడ్‌ అని విమర్శించారు.   కేసీఆర్‌ ఏక్‌ నంబరీ అయితే, కేటీఆర్‌ దస్‌ నంబరీ అని అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. కేటీఆర్‌.. చెల్లి, భావలతో కలిసి తెలంగాణ ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు కేటీఆర్‌ ఆస్తులు 400 శాతం ఎలా పెరిగాయని ప్రశ్నించారు. దీనిపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌, కేటీఆర్‌.. ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, సినీ నిర్మాతల నుంచి డబ్బులు వసూలు చేసి ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో కవిూషన్‌ తీసుకుని, ఆ డబ్బును మలేసియా, సింగపూర్‌కు తరలించి కేటీఆర్‌ పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. ఆ పనిని సత్యం రామలింగరాజు కుమారుడు తేజ్‌రాజ్‌ చూస్తున్నారని మధు యాష్కీ ఆరోపించారు. ఈ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న.. చర్చకు కేటీఆర్‌ సిద్ధమా అని ప్రశ్నించారు. సత్యం తేజ్‌ను తీసుకుని కేటీఆర్‌ అమెరికా, సింగపూర్‌, మలేసియా వెళ్లారని ఆరోపించిన మధుయాష్కి.. మలేసియా ప్రధానితో వారిద్దరూ ఉన్న ఫొటోను విడుదల చేశారు. 2014లో కేటీఆర్‌ ఆస్తులు రూ.7 కోట్లుంటే 2018లో రూ.41 కోట్లకు పెరిగిందని, 424 శాతం మేర ఆస్తులు ఎలా పెరిగాయని నిలదీశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కల్వకుంట్ల కుటుంబం చీకటి వ్యాపారాలు చేసి ఆస్తులు పెంచుకుందని మండిపడ్డారు.. త్వరలో కవిత, హరీశ్‌రావు అక్రమాస్తులను కూడా వెల్లడిస్తానని చెప్పారు. తెలంగాణ కోసం పిల్లలు ప్రాణ త్యాగం చేస్తే.. కేసీఆర్‌ కుటుంబం ఆస్తులు పెంచుకున్నదని అన్నారు. బెంగళూరులో కేటీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ బినావిూల గుట్టు త్వరలోనే బయటపెడతానని చెప్పారు. టెండర్లు పిలవకుండా రూ.1500 కోట్ల మిషన్‌ భగీరథ పనులను ఎలా అప్పగించారని ప్రశ్నించారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు గ్యాస్‌స్టవ్‌ అమ్ముకుని బీడీలు తాగిన వ్యక్తి కేసీఆర్‌ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. మొదటి ఎన్నికల బరిలో ఉన్న సమయంలో నమోదైన దొంగనోట్ల కేసు ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. కల్వకుంట్ల అజయ్‌రావు పేరు ఉంటే కల్వకుంట్ల తారకరామారావుగా పేరు మార్చుకున్నాడని, ఈయన ఆస్తులను గమనించాలన్నారు. యాష్కీ చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.