కేటీఆర్.. రాజీనామాకు కట్టుబడ్డావా?
– కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
హైదరాబాద్,జనవరి22(జనంసాక్షి): గ్రేటర్ ఎన్నికలు మరింత దగ్గర పడుతుండగా రాజకీయ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 డివిజన్లు గెలవకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేస్తారా అని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ 100 డివిజన్లు గెలుచున్నట్లయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. అయితే కెటిఆర్ సవాల్ వెనక అహం ఉందని శుక్రవారం గాంధీభవన్‌లో విూడిమయా సమావేశంలో అన్నారు. అహంతో పాటు అతి విశ్వాసం ఉందన్నారు. నామినేషన్లు ఉప సంహరించు కోవాలంటూ పోలీసుల ద్వారా కాంగ్రెస్ నేతలపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ పరిణామాలు తెలంగాణ ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 65 డివిజన్లలోనే పోటీ చేస్తున్న ఎంఐఎం మేయర్ సీటును ఎలా దక్కించుకుంటుందో… టీఆర్‌ఎస్ తో పొత్తు ఉందో లేదో ఎంఐఎం స్పష్టం చేయాలని షబ్బీర్ కోరారు. ఢిల్లీ నుంచి జాతీయ నేతలు వస్తున్నారే తప్పా… హైదరాబాద్ లోఉన్న కేసీఆర్ హెచ్సీయూ వర్సిటీకి వెళ్లక పోవడం దళితుల పట్ల టీఆర్‌ఎస్ కు చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనమన్నారు. 12 శాతం రిజర్వేషన్ల గురించి ఎంఐఎం ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. టికెట్ల కోసం నిరసనలు చేయడం కాంగ్రెస్ బలంగా
ఉందనడానికి నిదర్శనమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.